విత్తనాల కోసం రైతుల పడిగాపులు.. రంగంలోకి దిగిన కవిత

07-11-2026 | 05:54pm

పోలేపల్లి – దేవరకొండ: వేరుశనగ విత్తనాల కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న మహిళా రైతుల ఇబ్బందులపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) స్పందించారు. రైతుల సమస్యలను తెలుసుకున్న ఆమె వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌(Collector Chandrashekhar)కు ఫోన్ చేశారు. విత్తనాల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించి, తక్షణమే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో అధికారులు రైతులకు వేరుశనగ విత్తనాల సంచులు పంపిణీ చేశారు.

దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం పోలేపల్లి రైతు వేదిక వద్ద శనివారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మహిళా రైతులు వేరుశనగ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ విత్తనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులను అడిగినా సరైన స్పందన లేదని, విత్తనాలు పంపిణీ చేయకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో డిండి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైతు వేదిక వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు కనిపించారు. దీంతో అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. మహిళా రైతులు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకున్నారు.సాయంత్రం డిండి నుంచి తిరిగి వస్తున్న సమయంలోనూ మహిళా రైతులు రైతు వేదిక వద్దే ఉండటాన్ని గమనించిన కవిత అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. విత్తనాలు అందక తాము ఎదుర్కొంటున్న సమస్యలను మహిళా రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌కు ఫోన్ చేసిన కవిత.. విత్తనాల పంపిణీలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. గత ఏడాది 1,100 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయగా, ఈ ఏడాది కేవలం 600 క్వింటాళ్లు మాత్రమే కేటాయించడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉదయం నుంచి రైతులు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారని, వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

కవిత విజ్ఞప్తిపై స్పందించిన కలెక్టర్ చంద్రశేఖర్.. ఉదయం నుంచి ఎదురుచూస్తున్న మహిళా రైతులకు తక్షణమే వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంకా విత్తనాలు అవసరమైన రైతుల పేర్లను నమోదు చేసుకోవాలని, అదనంగా ఎంత పరిమాణంలో అవసరమో అంచనా వేసి తమకు ఇండెంట్ పంపించాలని సూచించారు.కలెక్టర్ ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి రైతు వేదిక వద్ద ఎదురుచూస్తున్న మహిళా రైతులకు వేరుశనగ విత్తనాల సంచులు అందజేశారు. దీంతో గంటల తరబడి వేచి ఉన్న రైతులకు ఊరట లభించింది.

విత్తనాల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి కవిత చొరవ తీసుకున్నారు. మిగిలిన రైతులకు కూడా అవసరమైన మేరకు విత్తనాలు అందించేందుకు ఇండెంట్ పంపించాలని కలెక్టర్ ఆదేశించడంతో తదుపరి పంపిణీపై రైతుల్లో ఆశలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు