నేల,నీటి సంరక్షణతోనే సుస్థిర వ్యవసాయం సాధ్యం
తాంసి/భీంపూర్,అక్టోబర్ 30(విజయక్రాంతి): సాంప్రదాయ సాగు(Traditional farming) పద్ధతులకు స్వస్తి పలికి,మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ(Modern agriculture) విధానాలను అనుసరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (District Collector Rajarshi Shah)రైతులకు పిలుపునిచ్చారు.
నేల సారాన్ని కాపాడుకుంటూ, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. శుక్రవారం భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాగుభూమి సంరక్షణ’ రైతు అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో సాధారణం కంటే 35 నుంచి 36 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, భీంపూర్ మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిందని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతుల పట్ల బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పాత బకాయిలు, రుణాల వసూళ్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయరాదని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఈ అంశంపై త్వరలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతులకు అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిప్పల్కోటి రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియకు సంబంధించి అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసి భూములు కోల్పోతున్న రైతులందరికీ నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు..
అంతకుముందు గ్రామంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ (వీబీ-జీ రామ్ జీ) పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫార్మ్ పాండ్ (వ్యవసాయ క్షేత్ర నీటి కుంట) పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. వ్యవసాయంలో నేల యాజమాన్యం, నీటి నిర్వహణ, భూసార పరిరక్షణకు సంబంధించి కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, నిర్మాణ పనులు త్వరగా పూర్తికావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షాను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డిఎఓ రవీందర్ సింగ్, డీఆర్డీఓ పీడీ రాథోడ్ రవీందర్, కేవీకే శాస్త్రవేత్త రాంగోపాల్ వర్మ, తహశీల్దార్ రమేష్ నాయక్, ఎంపీడీఓ గోపాలకృష్ణ రెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజారెడ్డి,మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి,నాయకులు నారాయణ, ప్రవీణ్, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు..