మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం

30-10-2026 | 06:13pm

ఆలేరు, అక్టోబర్ 30 (విజయక్రాంతి): మహిళా సంఘాల సభ్యులు(Members of women's groups) ప్రభుత్వ పథకాలను(government schemes) సద్వినియోగం చేసుకొని వివిధ స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి(Collector Anurag Jayanti ) సూచించారు.

శుక్రవారం ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సంఘం (సంఘబంధం) సమావేశం, మహిళా సంఘాల సభ్యుల స్క్రీనింగ్ క్యాంపును కలెక్టర్ సందర్శించి మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమ నైపుణ్యాలు, ఆసక్తులకు అనుగుణంగా టైలరింగ్, కిరాణా దుకాణాలు, కంప్యూటర్ కేంద్రాలు, డ్రోన్ సేవలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ద్వారా నైపుణ్య శిక్షణ అందించి, అర్హతను బట్టి బ్యాంకు రుణాలు, సబ్సిడీలతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా యూనిఫామ్‌ల తయారీ, క్యాంటీన్ల నిర్వహణ వంటి ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు, సాంకేతిక కారణాలతో ఆలస్యమైన వైద్య నివేదికలను త్వరలో అందజేస్తామని వెల్లడించారు. అనంతరం ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో VB-G RAM G పథకం కింద రైతు పొలంలో నిర్మిస్తున్న ఫామ్ పాండ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణతో పాటు రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడేలా మునగ తోటల పెంపకం, ఫామ్ పాండ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, పశువుల షెడ్లు, నీటి తొట్లు, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

కూలీలకు నిబంధనల ప్రకారం రోజుకు రూ.308 కూలి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో చెరువుల పూడికతీత పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భూగర్భ జలాల అభివృద్ధికి, వ్యవసాయ అవసరాలకు నీటి లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ తరహా పనులను అన్ని గ్రామపంచాయతీల్లో ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, DPM (IB), ఎంపీడీఓ, తహసీల్దార్, ఏపీఎం, గ్రామ సర్పంచ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఇతర అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు