పత్తి కొనుగోలులో దళారుల చేతివాటం
- పత్తి మూటల కొనుగోలులో దళారులదే పైచేయి
- మార్కెట్ ధర కంటే పత్తి మూటల కొనుగోలులో క్వింటాకు రూ.300 నుంచి రూ.400 కోత
ఉట్నూర్, నవంబర్ 18 (విజయక్రాంతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు(Tribal farmers) ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను విక్రయించ సమయంలో తూకంలో మోసంతో పాటు గిట్టుబాటు ధర లభించక లబోదిబోమంటున్నారు. వర్షాకాలంలో అనుకున్నంత వర్షాలు కురవక పంటలపై పెట్టిన పెట్టుబడి చేతికి రాక ఒకపక్క రైతులు ఆందోళన చెందుతుంటే.. మరోపక్క వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని రైతులను పత్తి పంట కొనుగోలు నట్టేట ముంచుతున్నారు.
గిరిజన రైతులు తమ నిత్యవసర అవసరాలకు నిమిత్తం మూటలలో పత్తి తీసుకువచ్చి వ్యాపారులకు అమ్ముతున్నారు. మార్కెట్లో క్వింటాల్ పత్తికి రూ. 9150 చెల్లించి కొనుగోలు చేస్తుంటే... మూటల్లో తీసుకువచ్చిన పత్తి కి రూ. 8650 నుంచి 8750 రూపాయలు చొప్పున కొనుగోలు చేయడంతో పాటు పత్తి తీసుకువచ్చిన బట్టకు కేజీ చొప్పున తగ్గించడంతోపాటు ఇంటి నుంచి తీసుకు వచ్చిన 25 కేజీల పత్తికి 23 నుంచి 24 కేజీలు తూకం వేస్తున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. 10 నుంచి 25 కేజీల పత్తికి హమాలి పేరుతో నగదులో కోత విధిస్తున్నారని రైతులంటున్నారు.
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల పరిధిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి 39 మంది లైసెన్సులు పొందిన వ్యాపారులు ఉంటే, ఏజెన్సీ ప్రాంతంలో వంద మందికి పైగా వ్యాపారులు వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి లైసెన్సులు పొందకుండా పత్తి పంట తో పాటు మొక్కజొన్న, సోయా పంటలను కొనుగోలు చేస్తూ.. ఇటు ప్రభుత్వానికి.. అటు రైతులను మోసం చేస్తున్నారు. లైసెన్సులు లేకుండా రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు రైతులను మోసం చేసే వారిపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
లైసెన్సులు లేకుండా కొనుగోలు చేసే వారిపై నిఘా ఏర్పాటు చేశాం..
ఇంద్రవెల్లి వ్యవసాయం మార్కెట్ కమిటీ పరిధిలోని మండలాలలో 39 మంది వ్యాపారులు లైసెన్సులు పొంది ఉన్నారు. లైసెన్సులు లేని కొంత మంది వ్యాపారులు గ్రామాలతో పాటు పంట పొలాలకు వెళ్లి తక్కువ ధరకే పంటలు కొనుగోలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చింది. లైసెన్సులు లేకుండా రైతుల వద్ద తక్కువ ధరలకు పంటలు కొనుగోలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. తనిఖీల్లో పట్టుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హెచ్చరించారు.
శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఇంద్రవెల్లి