ఆడియోబుక్‌లను ప్రారంభించిన స్పాటిఫై
ముంబై: లోకల్ ట్రైన్ ప్రయాణంలో ఓ థ్రిల్లర్ కథ, ఉదయం నడకలో ఓ జ్ఞాపకాల పుస్తకం, పడుకునే ముందు ఓ ఫిలాసఫీ పుస్తకం... ఇకపై ఇవన్నీ స్పాటిఫైలోనే ఆస్వాదించవచ్చు. నేటి నుంచి స్పాటిఫై(Spotify) ఆడియోబుక్‌లను భారతదేశంలో అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో మీకు ఇష్టమైన సంగీతం, పాడ్‌కాస్ట్‌లు, పుస్తకాలు అన్నీ ఒకే చోట లభించనున్నాయి. భారతదేశంలో కథలు వినే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. మన ఇతిహాసాలు తరతరాలుగా మౌఖికంగా వ్యాప్తి చెందాయి.
తాతామామ్మలు నిద్రపోయే ముందు పిల్లలకు కథలు చెప్పేవారు. నేటి తరం, పాడ్‌కాస్ట్‌లను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంది. ఇప్పుడు స్పాటిఫై ఆడియోబుక్‌లతో ఈ సంప్రదాయానికి మరో కొత్త అధ్యాయం జోడిస్తోంది. ఆడియోబుక్స్+ ప్లాన్‌తో శ్రోతలు ప్రతి నెలా 15 గంటల పాటు ఆడియోబుక్‌లను వినవచ్చు. అదనపు చెల్లింపుతో వినే సమయాన్ని పెంచుకోవచ్చు లేదా ఒక్కో పుస్తకాన్ని విడిగా కొనుగోలు చేయవచ్చు. క్లాసిక్ రచనలు, విశేష ఆదరణ పొందిన పుస్తకాలు, కొత్తగా పరిచయమయ్యే రచనలతో కూడిన విస్తృతమైన కేటలాగ్‌లోని ఆడియోబుక్‌లు, వారికి ఇష్టమైన సంగీతం, పాడ్‌కాస్ట్‌లతో పాటు అందుబాటులో ఉంటాయి.
మిస్టర్ అమర్‌జిత్ సింగ్ బాత్రా, జీఎం సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మరియు ఎండీ, స్పాటిఫై, ఇండియా మాట్లాడుతూ, “భారతదేశంలో కథలను చదవడం ఎంత సహజమో, వినడం కూడా అంతే సహజమైన సంప్రదాయం. స్పాటిఫైలో ఆడియోబుక్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, మా శ్రోతలు ఇప్పటికే ఆస్వాదిస్తున్న సంగీతం, పాడ్‌కాస్ట్‌లతో పాటు పుస్తకాలను కూడా ఒకే వేదికపై అందిస్తున్నాము.
భారతీయ శ్రోతలు తమకు నచ్చిన తదుపరి పుస్తకాన్ని సులభంగా కనుగొనేలా చేయడంతో పాటు, ‘స్పాటిఫై ఫర్ ఆథర్స్’ ద్వారా స్వతంత్ర రచయితలు, స్వయంగా పుస్తకాలను ప్రచురించే రచయితలు సహా భారతీయ రచయితలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరింత మంది పాఠకులు, శ్రోతలను చేరుకునేందుకు తోడ్పడటం మా లక్ష్యం,” అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడియోబుక్‌లకు ఆదరణ పెరుగుతోంది. స్పాటిఫైలో నెలవారీ ఆడియోబుక్ శ్రోతల సంఖ్య ఏటా సుమారు 40% పెరగగా, ఆడియోబుక్‌లు వినే మొత్తం గంటలు 30% కంటే ఎక్కువగా పెరిగాయి. అమెరికాలో స్పాటిఫై ద్వారా ఆడియోబుక్‌లు వినే వారిలో 18–34 ఏళ్ల వయస్సు గలవారు 57% ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మంది ప్రచురణకర్తలు, 50,000 మందికి పైగా రచయితల నుంచి 8 లక్షలకు పైగా ఆడియోబుక్‌లను స్పాటిఫై అందిస్తోంది.