సిద్దిపేటపై సీఎం గురి!

19-11-2026 | 05:05am
  1. గులాబీ కంచుకోటను బద్దలుకొట్టేందుకు వ్యూహం
  2. నేడు సిద్దిపేటలో కాంగ్రెస్ భారీ సభ
  3. ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం
  4. కోటి కుటుంబాలకు బీమా ప్రయోజనం
  5. రూ.544.11 కోట్ల అంచనాతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం 
  6. ఇందిరమ్మ చీరల పంపిణీ వాయిదా : మంత్రి సీతక్క

సిద్దిపేట, నవంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న సిద్దిపేట గడ్డపై గురువారం కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పర్యటనతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్‌ఎస్‌కు బలమైన కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో కాంగ్రెస్ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ పుట్టిన గడ్డ.. తెలంగాణ ఉద్యమానికి కీలక కేంద్రం.. గులాబీ పార్టీకి బలమైన రాజకీయ పునా ది.. అలాంటి సిద్దిపేటలో కాంగ్రెస్ తన రాజకీయ బలాన్ని చాటుకునేందుకు భారీ సభకు సిద్ధమవడం చర్చకు దారితీసింది. ఇక్కడి నుంచి హరీశ్‌రావు ఏడుసార్లు ఎ మ్మెల్యేగా విజయం సాధించడం సిద్దిపేట రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచుతోంది. అలాంటి చోట కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభ రాజకీయంగా ఎలాంటి సందేశాన్ని ఇవ్వనుందన్న చర్చ మొదలైంది.

గులాబీ కోటరీపై ఫోకస్

సిద్దిపేటలో కాంగ్రెస్ సభ కేవలం ప్ర భుత్వ కార్యక్రమానికే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో సిద్దిపేట గడ్డపై దండయాత్ర చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఈ పర్యటన మరింత ఆసక్తి రేపుతోంది. బీఆర్‌ఎస్ బలంగా ఉన్న ప్రాంతంలో భారీ సభ నిర్వహించి కాంగ్రెస్ తన ఉనికిని, బలాన్ని చాటుకోవాలని భావిస్తోంది.

పలు కార్యక్రమాలకు శ్రీకారం

సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ వేదికగా కీలక పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. గురువారం నుంచే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక ఈ స్కీం ద్వారా కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.  ఇందిరమ్మ చీరలు కూడా ఇదే వేదికగా పంపిణీ చేయాలనుకున్నా చివరి నిమిషంలో వాయిదాపడింది. ఈ విషయాన్ని మంత్రి ధనసరి సీతక్క ప్రకటించారు.

రూ.544.11 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు

ఈ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధిపేటలో రూ.451.13 కోట్ల అంచనా వ్య యంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.92.98 కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాల్లో రూ.200 కోట్ల చొప్పున నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని 7 ప్రభుత్వ స్కూళ్లల్లో రూ.15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి, రూ.13.50 కోట్లతో 6 తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుడతారు.

చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో, దౌల్తాబాద్‌లో రూ. 7.80 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు పునాది వేయనున్నారు. జనగామ నియోజకవర్గంలో రూ.6.89 కోట్లతో నిర్మించనున్న మూడు విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. సిద్ధిపేట జిల్లాలో రూ.54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ.14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రాన్ని, రూ.12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్సును ప్రారంభించనున్నారు. రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామల మహిళా సంఘాల భవనాలను, రాయపోల్‌లో రూ.3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని, గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

సీఎం టూర్ షెడ్యూల్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేటకు బయలుదేరుతారు. ముస్తాబాద్ చౌరస్తా సమీపంలోని కాలేజీ గ్రౌండ్‌లో దిగుతారు. ఇందిరమ్మ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో గల సభ ప్రాంగణానికి పాదయాత్ర ద్వారా చేరుకుంటారు.  

సిద్దిపేట రాజకీయాల్లో ఆసక్తి

కేసీఆర్ పుట్టిన ప్రాంతం.. హరీశ్ రావు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డ.. బీఆర్‌ఎస్ రాజకీయాలకు బలమైన కేంద్రంగా ఉన్న సిద్దిపేటలో కాంగ్రెస్ సభ రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది.

మరిన్ని వార్తలు