కానిస్టేబుల్‌నే చంపబోయిన ఇసుక మాఫియా!
పోలీసులపై పికప్ వాహనంతో దాడి
కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్నపేటలో ఘటన
గంభీరావుపేట, నవంబర్ 18 (విజయక్రాంతి): ఇసుక మాఫియా ఎంతగా తెగించిందంటే.. ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడింది. ఇద్దరు కానిస్టేబుళ్లను వాహనంతో ఢీకొట్టింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మండలం లింగన్నపేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ ఎ.రమేశ్ తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం అర్ధరాత్రి 12.35 గంటల సమయంలో హోంగార్డు మహిపాల్, కానిస్టేబుల్ రమేశ్ బ్లూకోల్ట్స్ విధుల్లో ఉన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పికప్ వాహనం లింగన్నపేట వైపు వెళ్తున్నట్లు వీరికి సమాచారం అందింది. ఆ వాహనాన్ని పట్టుకునేందుకు గ్రామంలోని హైస్కూల్ వద్ద కాపు కాశారు. ఆ బండిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పికప్ వాహనం డ్రైవర్ ఆపకపోవడం అటుంచి, ఏకంగా వీరిద్దరిని ఢీకొట్టి పరారయ్యాడు.
ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రమేశ్ కుడిచేయి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనలో పికప్ డ్రైవర్ సూర లక్ష్మణ్, వాహన యజమాని వేముల విజయ్, ఆలకుంట మధుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై బాలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, పలువురు పోలీసులు డిమాండ్ చేస్తున్నారు.