ఉత్తర్వులు ఇస్తలేరు సార్!

19-11-2026 | 05:10am
  1. డీఎస్సీ టీచర్లకు అందని ప్రొబేషనరీ ఉత్తర్వులు
  2. కాల పరిమితి ముగిసినా 9వేల మంది డిక్లరేషన్ ఆర్డర్లు పెండింగ్   
  3. ఇప్పటివరకు 9 జిల్లాల్లోనే పూర్తయిన ప్రక్రియ 
  4. బెనిఫిట్స్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): డీఎస్సీ(DSC) ద్వారా నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రొబేషనరీ పీరియడ్(Probationary Period) గత అక్టోబర్ నెల 9వ తేదీ నాటికే రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. కానీ ఇంతవరకూ వారికి ఆ ఉత్తర్వులు అందనేలేదు. ఉత్తర్వుల జారీలో విద్యాశాఖ ఉన్నతా ధికారుల ఆదేశాలను జిల్లాల విద్యాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. ఇప్పటికే ఒక నెల ఇంక్రిమెంట్‌ను కోల్పోయామని, ఈనెలలోనైనా ఇంక్రిమెంట్ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నామని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కానీ జిల్లాల విద్యాధికారుల నిర్లక్ష్యం, కాలయాపనతో తాము నష్టపోతున్నామని వేలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

9 వేల మందికి అందని ఉత్తర్వులు..

దాదాపు 11వేల మందికిపైగా డీఎస్సీ నియామకాలు పొందారు. వీరందరికీ ప్రొబేషనరీ పీరియడ్ విధించారు. అయితే, కేవలం 2వేల మందికి మాత్రమే ఆ ఉత్తర్వులు అందాయి. ఇంకా 9 వేల మంది ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కేవలం 9 జిల్లాల్లో పూర్తి కాగా, ఇంకా 24 జిల్లాల్లో ప్రొబేషనరీ డిక్లరేషన్ ఉత్తర్వుల ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. 2024 అక్టోబర్ 10 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 9 నాటికి వీరంతా రెండు సంవత్సరాల ప్రొబేషన్ పూర్తయింది.

ఈ ఉత్తర్వులు ఆలస్యం కావడంతో రెండవ వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు కాలేదు. దీంతో ఈ సమస్యను పాఠశాల విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లగా అన్ని జిల్లాల డీఈవోలు తక్షణమే ప్రొబేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని గత అక్టోబర్ 24న ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులిచ్చి నెల రోజులు కావొస్తున్నా ఈ రోజు వరకు కనీసం పది జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేయలేకపోయారు.  రీ వెరిఫికేషన్లు అంటూ కాలయాపన చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఇప్పటి వరకు సిద్ధిపేట, గద్వాల్, కామారెడ్డి, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిరిసిల్ల, నారాయణపేటతోపాటు మరోక జిల్లాల్లో మాత్రమే డిక్లరేషన్ ప్రక్రియ పూర్తయింది. 

గతానికి భిన్నంగా ప్రక్రియ..

గతంలో నిర్వహించిన ఏ డీఎస్సీకి లేని నిబంధనలు, సమస్యలు డీఎస్సీ ఉపాధ్యాయులకు మాత్రమే ఎందుకు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయితే రెండవ వార్షిక ఇంక్రిమెంట్ ఎలాంటి అవరోధాలు లేకుండా ఉపాధ్యాయులకు రావాలి. కానీ ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రక్రియ సాగుతుంది. ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు ఇవ్వకుండా ఇంక్రిమెంట్ ఇవ్వలేమని జిల్లా అధికారులు ఉపాధ్యాయుల ఇంక్రిమెంట్‌లను పక్కన పెడుతున్నారు.

దీంతో అక్టోబర్ నెలతోపాటు ఈ నెలలో కూడా ఇంక్రిమెంట్  అందుతుందో లేదోనని ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. గత నెలది ఇప్పటికే పెండింగ్. ఈ నెలది రావాలంటే ఈనెల 23, 24 తేదీల్లోగా ప్రొబేషన్ ఉత్తర్వులు రావాల్సి ఉం టుంది. పోలీస్ వెరిఫికేషన్ అని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని రకరకాల కారణాలతో అధికారులు కాలయాపన చేస్తున్నారని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. 

డిక్లరేషన్ ప్రక్రియ త్వరగా ముగించాలి: టీడీబీజీటీఏ నేత ఆర్.రామ్మోహన్ రెడ్డి

ప్రత్యక్ష నియామకమైన ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రొబేషనరీ డిక్లరేషన్ ప్రక్రియను త్వరగా ముగించాలి. అనేక డీఎస్సీలో లేని జాప్యం డీఎస్సీ ఎందుకు జరుగుతున్నది. ప్రక్రియను పూర్తి చేసి వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. అనేక జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తికాక ఉపాధ్యాయులంతా ఆందోళనలో ఉన్నారు.

గత నెల ఇంక్రిమెంట్‌తో పాటు ఈ నెల ఇంక్రిమెంట్ వెంటనే మంజూరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ రెండు సంవత్సరాల సర్వీస్ కాలంలో మెటర్నటీ సెలవులు, ఇతర మెడికల్ సెలవులు, వేతనంతో కూడిన సెలవులు తీసుకున్న వారికి యథావిధిగా ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం నేత రావుల రామ్మోహన్ రెడ్డి అధికారులను విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు