2 వేల కేసులకు పరిష్కారం.. జడ్జికి ఘన వీడ్కోలు!

07-11-2026 | 01:29pm

బోధన్, నవంబర్ 06 (విజయక్రాంతి): న్యాయం కోసం కోర్టు గడప తొక్కిన ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తూ, తనదైన ప్రత్యేక శైలిలో సేవలందించిన బోధన్ అదనపు న్యాయమూర్తి సాయి శివకు ఘన వీడ్కోలు లభించింది. పదవీకాలం ముగియడంతో ఆయన యాదాద్రి భువనగిరి కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, పోలీసు శాఖ అధికారులు, కోర్టు సిబ్బంది ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.

2023 అక్టోబర్‌లో బోధన్ అదనపు న్యాయమూర్తిగా తొలి పోస్టింగ్‌పై బాధ్యతలు స్వీకరించిన సాయి శివ.. మూడేళ్ల పదవీకాలంలో రెండు వేలకు పైగా కేసులను పరిష్కరించి ప్రజలకు న్యాయం అందించడంలో విశేష కృషి చేశారు. న్యాయ సేవా కార్యక్రమాలు (Legal Services) నిర్వహించడంతో పాటు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపారు.

నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే, కోర్టుకు వచ్చే కక్షిదారుల పట్ల ఓర్పు, కరుణ, నిబద్ధతతో వ్యవహరించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. ముఖ్యంగా కుటుంబ, వివాహ సంబంధిత కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. ఇరువర్గాల సమస్యలను అర్థం చేసుకుంటూ న్యాయం అందించేందుకు ప్రయత్నించేవారు. ఈ క్రమంలో గత ఏడాది కరుణ గల న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు.

2025 ఏప్రిల్‌లో నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధ దంపతులు తమ సమస్యను చెప్పుకునేందుకు కోర్టుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న న్యాయమూర్తి సాయి శివ స్వయంగా బయటకు వచ్చి వారి వద్దకు వెళ్లి సమస్యను ఆలకించారు. ఆయన చూపిన మానవత్వం (Humanity) అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. న్యాయం అనేది కేవలం కోర్టు గదులకే పరిమితం కాదని, బాధితుల పరిస్థితిని అర్థం చేసుకోవడంలోనూ ఉందని తన చర్యతో నిరూపించారు.

కోర్టు విధులతో పాటు సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యేవారు. చట్టాలు, న్యాయవ్యవస్థ, హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. దీంతో న్యాయమూర్తిగానే కాకుండా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా కూడా మంచి గుర్తింపు సంపాదించారు.

మూడేళ్లపాటు బోధన్‌లో ఆయన అందించిన సేవలు, పరిష్కరించిన కేసులు, ప్రజల పట్ల చూపిన మానవత్వం చిరస్మరణీయంగా నిలుస్తాయని పలువురు కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ మరింత మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షిస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.

మరిన్ని వార్తలు