పుట్టగొడ్ల సాగుతో స్వయం ఉపాధి!
భిక్కనూర్, నవంబర్ 7 (విజయక్రాంతి): ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యవసాయంలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటూ భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితులు జంగబోయిన రామచంద్రం, బుడ్డ అంజనేయులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పుట్టగొడుగుల సాగు (Mushroom Cultivation) చేపట్టి స్వయం ఉపాధి పొందుతున్నారు.
రామచంద్రం ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే తన వ్యవసాయ క్షేత్రంలో పుట్టగొడుగుల సాగు చేపట్టారు. ఎం.కామ్ పూర్తి చేసిన అంజనేయులు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక శిక్షణ (Special Training) పొందారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడుతూ నూతన వ్యవసాయ విధానాలకు శ్రీకారం చుట్టారు.
తక్కువ స్థలంలోనే పుట్టగొడుగుల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని వారు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా యువత వ్యవసాయ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిస్తున్నారు. ఆసక్తి ఉన్న యువత, రైతులకు సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పుట్టగొడుగుల సాగుపై ఆసక్తి ఉన్నవారు 9866786897, 7676882280 నంబర్లను సంప్రదించవచ్చు.