కమ్ముకొస్తున్న కరువు మేఘాలు..
- ఎండిన చెరువులు, వాగులు
- వాడిపోయిన పత్తి పంట.. దిగుబడి లేక రైతన్నల దిగులు
తలమడుగు, నవంబర్ 6 (విజయక్రాంతి) : ప్రకృతి వైపరీత్యాలు, ఎల్ నినో ప్రభావంతో(The impact of El Niño) ఈ సంవత్సరం మొదటి నుంచి వర్షాలు తక్కువ కురవడంతో వేసవికి ముందే చెరువులు, వాగులు అడుగంటి పోతున్నాయి. చేతి కొచ్చిన పత్తి పంట రైతుల(Cotton crop farmers) కనుల ముందే ఎండిపోవడంతో పంట దిగుబడి లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కరువు పరిస్థితులను జయించేందుకు ప్రభుత్వం అందించే కరువు సాయంపై అన్నదాతలు కొండంత ఆశతో ఎదురుచూస్తు న్నారు. ఎల్ నీనో ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల ను కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ తలమడుగు మండలాన్ని ప్రభుత్వం విస్మరించింది.
కరువు మండలంలో రైతుల ఆత్మహత్య..
తలమడుగు మండలంలో వర్షాలు లేక, పంటలు సక్రమంగా పండక పోవడంతో వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మండలంలో చేసిన అప్పులు తీరక దిగులు చెంది, కుటుంబ పోషణ భారమై లస్మన్న, ప్రతాప్ రెడ్డి అనే ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల పండగ రైతులను అన్ని విధాలు ఆదుకోవలసిన ప్రభుత్వం ఇప్పటికి కరువు నివారణ చర్యలపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో అన్నదాతలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయమే జీవనాధారం...
మండలంలో దాదాపు 90 శాతం మంది రైతులు వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం రైతులకు ఇబ్బంది తప్పడం లేదు. గత సంవత్సరం అధిక వర్షాలతో పంటలు నష్టపోగా, ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక పోవడంతో పత్తి పంటలో దిగుబడి రావడం లేదన్నారు. రైతులు ఎకరానికి దాదాపు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు చేయగా ఒక ఎకరంకు క్వింటాల్ పత్తి కూడా దిగుబడి రావడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసా పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో , ప్రైవేటు వ్యక్తుల వద్ద లక్షల రూపాయలు అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా మండలంలో సోయపంట సాగు చేసిన రైతులకు దిగుబడి లేక ఎకరానికి రెండు నుంచి మూడు క్వింటాలే సోయ దిగుబడి వచ్చిందన్నారు. అదేవిధంగా వర్షాలు లేక కంది పంట సైతం వాడిపోనున్నదన్నారు.
ఎండిపోయిన చెరువులు, వాగులు...
మండలంలోని లక్ష్మీ పూర్ చెరువు వేసవికి ముందే పూర్తిగా అడుగంటి పోవడంతో రైతులకు సాగునీరు ఇబ్బందులు ఎదురయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి వ్యవసాయంలో నష్టపోయిన రైతులందరికీ ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. రైతులకు వేసవి కాలంలో పనులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని మండలవాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.