గోదాం ఘనం..నిర్వహణ శూన్యం
- 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం
- రైతులకు అందని పూర్తిస్థాయి ప్రయోజనాలు
- గడ్డి, రాళ్ల గుట్టల మధ్య ఆధునిక గోదాం
- చిన్న వాహనం వెళ్లాలన్నా ఇబ్బందులే...
కంగ్టి, నవంబర్ 6 : రైతు పండించిన పంటకు భద్రత..వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్మించిన ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాం(Agricultural Market Warehouse) రైతులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో 2,500 మెట్రిక్ టన్నుల భారీ నిల్వ సామర్థ్యం కలిగిన గోదాం ఉన్నప్పటికీ దాని ప్రాంగణంలో కనీస మౌలిక వసతులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎక్కడ చూసినా రాళ్లు, రప్పలు, పిచ్చిమొక్కలు కనిపిస్తుండగా కనీసం చిన్న నాలుగు చక్రాల వాహనం వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. రైతుల సంక్షేమం కోసం నిర్మించిన గోదాం వారికి నిజంగా ఉపయోగపడేలా ఎప్పుడు అభివృద్ధి చెందుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారీ గోదాం.. కానీ కనీస సౌకర్యాలు కరువు..
ప్రజాధనంతో నిర్మించిన 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారాల్సి ఉంది. పంట ఉత్పత్తులను భద్రపరచుకోవడంతో పాటు అవసరమైన సమయంలో నిల్వ సదుపాయాలను వినియోగించుకునే అవకాశం కలగాలి. కానీ గోదాం ప్రాంగణంలో రాళ్ల గుట్టలు, పిచ్చిమొక్కలు పేరుకుపోవడం, వాహనాల రాకపోకలకు అనువైన పరిస్థితులు లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. పంటలను ఎండబెట్టుకోవడానికి కూడా అనువైన స్థలం లేకపోవడంతో గోదాం నిర్మాణం వల్ల ఆశించిన ప్రయోజనం అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణం మాత్రమే కాదు... నిర్వహణ కూడా ముఖ్యమే..
ఒక రైతు విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు ఎన్నో కష్టాలు పడతాడు.పెట్టుబడి, సాగునీరు, కూలీల ఖర్చులు భరించి పంట పండిస్తాడు. అలాంటి రైతుకు ప్రభుత్వం కల్పించే నిల్వ సదుపాయాలు, మార్కెట్ వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి. గోదాం నిర్మాణంతోనే ప్రభుత్వ బాధ్యత ముగిసిపోదు. దాని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వాహనాల రాకపోకలకు అనువుగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దడం, రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం.
నాబార్డుకు ప్రతిపాదనలు పంపించాం..
గోదాం ప్రాంగణంలో సీసీ పనులు చేపట్టేందుకు నాబార్డ్కు ప్రతిపాదనలు పంపించాం. నాబార్డ్ నుంచి ఆమోదం లభించిన వెంటనే పనులు చేపట్టి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వేషన్ పరిధిలో ఉండటంతో కమిటీ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో కమిటీ ఏర్పాటు పూర్తయిన తర్వాత సీసీ పనులు, రైతులకు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. గోదాంను ఎస్డబ్ల్యూఎస్కు లీజు ప్రాతిపదికన అప్పగించాం.
వీర్ శెట్టి, కంగ్టి మార్కెట్ కమిటీ కార్యదర్శి