ధాన్యం కొనుగోళ్లు షురూ !
జగిత్యాలలో ఆలస్యం
కరీంనగర్, నవంబరు 6 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు(Paddy procurement) ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్, ఐకేపీ , మెప్మా ఆధ్వర్యంలో 318 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 2.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 6.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వ కేంద్రాలకు దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది దీనిలో 1.8 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు వస్తుందని అంచనా వేశారు.
కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, విద్యుత్ వసతి, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలను అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా చూసుకోవాలని, నిబంధనల ప్రకారం ధాన్యం తేమ శాతం 17 శాతం మించకూడదని సూచించారు.
పెద్దపల్లి జిల్లాలో...పెద్దపల్లి జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు కలెక్టర్ నేతృత్వంతో జిల్లా పౌర సరఫరా శాఖ, సహకార శాఖ, ఐకేపీ తదితర వాటి సౌజన్యంతో పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.
ఇందులో 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం మొత్తం 311 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తగిన కార్యాచరణ రూపొందించింది. - రాజన్న సిరిసిల్ల జిల్లాలో...రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 257 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,47,700 ఎకరాలు వరి ధాన్యం సాగు. సాగు చేశారు. సన్న వడ్లు అంచనా 79% సాగు చేసినట్లు అధికారులు తెలిపారు.
సన్నవడ్లు ఎకరానికి 21-23.5 క్వింటాళ్ల దిగుబడి, దొడ్డు వర్లు 25-30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.- జగిత్యాల జలాల్లో...జగిత్యాల జిల్లాలో ఐకేపీ 140, ఫ్యాక్స్ 284, మెప్మా 1, మొత్తం 425 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 2025 రబీ లో 6.40 మెట్రిక్ టన్నుల ధాన్యం, రాగా 2025 ఖరీఫ్ లో 3.20 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో కోనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.