‘బయో’రకం.. భయానకం..!
- నాసిరకం బయో మందులు.. వాడిన రైతుకు తప్పని గుబులు!
- తగ్గని రోగాలు - పెరుగుతున్న అప్పులు
- సోషల్ మీడియా మాయలో పడి వాడకాలు
- పేరొకటి.. మందొకటంటూ ఆరోపణలు
- వ్యవసాయ శాఖ అధికారుల అలసత్వం.. వ్యాపారుల అరాచకత్వం?
- అనుమతులు లేనీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతుల వేడుకోలు
మేళ్లచెరువు, నవంబర్ 6 :పంటల దిగుబడి పెరుగుతుందని, చీడపీడల బాధ(Pest control) తప్పుతుందని ఆశపడ్డ రైతన్నలకు ’బయో’ ఉత్పత్తులు(‘Bio’ products) తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేని, నాసిరకం బయో మందులు, ఎరువుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారవుతున్న ఈ ఉత్పత్తులతో పంటలు దెబ్బతినడమే కాకుండా, రైతులు లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మొత్తానికి ఈ ’బయో’రకం మందులు భయానకంగా మారాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సోషల్ మీడియా మాయలో పడేగా..! :
గతంలో నకిలీ విత్తనాలు, మందులు అమ్మడానికి వ్యాపారులు గ్రామాల బాట పట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యూట్యూబ్ , ఇన్స్టాగ్రామ్ వేదికలుగా మారిపోయాయి.కొందరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేని బయో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు.‘ఈ ల్యాండ్ గ్రోత్ ప్రమోటర్ వాడితే దిగుబడి డబుల్ అవుతుంది‘, ‘రసాయనాలు లేకుండా పురుగుల ను తుడిచిపెట్టేస్తుంది‘ అంటూ ఆకర్షణీయమైన రీల్స్, షారట్స్ చేసి రైతులను ఆకట్టుకుంటున్నారు.అసలు ఆ ప్రొడక్ట్‌లో ఏముందో, దానికి వ్యవసాయ శాఖ అనుమతి ఉందో లేదో కూడా తెలియకుండానే, రీల్స్ మోజులో పడి రైతులు ఆన్లైన్లో మరియు స్థానిక వ్యాపారుల వద్ద ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసి మోసపోతున్నారు.
’ బయో’ పేరిట విష రసాయనాలు? :
ఆర్గానిక్, బయో పేరుతో విక్రయిస్తున్న చాలా ఉత్పత్తుల్లో నిషేధిత లేదా నాసిరకం కెమికల్స్ కలుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని వాడిన కొద్దిరోజులకే పైరు మాడిపోవడం లేదా పూత, పిందె రాలిపోవడం జరుగుతోందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో ఎకరాకు వేల రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరవుతోందని రైతులు చెబుతున్నారు.
అధికారుల అలసత్వం.. వ్యాపారుల అరాచకత్వం..!
మండలంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ఇంత బహిరంగంగా బయో ఉత్పత్తుల పేరిట దందా సాగుతున్నా వ్యవసాయ అధికారులు మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో బయో మందులు అమ్ముతున్న వ్యాపారుల అరాచకత్వం పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.దుకాణాలపై దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారనీ స్థానికుల ద్వారా ఆరోపణలు వస్తున్నాయి.సామాజిక మాధ్యమాల్లో రైతులను మభ్యపెడుతున్న వారిపై గానీ, లైసెన్స్ లేని ఉత్పత్తులను విక్రయిస్తున్న ఏజెంట్లపై గానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందనీ స్థానిక రైతులు చర్చించుకుంటున్నారు.అధికారుల ఉదాసీనతే ఈ దందారాయుళ్లకు చుట్టూ రక్షణ కవచంలా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా చేస్తే సరి :
వెంటనే మండలంలోని పరిసర ప్రాంతాలలో ఎరువులు, పురుగుమందుల షాపులపై సమగ్ర తనిఖీలు చేపట్టాలి.అనుమతులు లేని బయో ఉత్పత్తుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలి.ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు, సదరు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి.నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలి.వ్యవసాయ అధికారులు ఇప్పటికైనా తేరుకుని నకిలీ బయో మందులు అమ్ముతున్న వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి వారిపై చట్టపరైన తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.