బెంగళూరులో ఉన్మాది నరమేధం
- ఏడుగురిని హతమార్చిన క్యాబ్ డ్రైవర్
- భార్య సహా అత్తింటి వారిపై దారుణం
- 20 రోజుల్లోనే ఏడుగురి హత్య
బెంగళూరు, నవంబర్ 6: బెంగళూరులో ఒళ్లు గగుర్పొడిచే నరమేధం జరిగింది. ఒక క్యాబ్ డ్రైవర్(Cab Driver) తన భార్యతో సహా అత్తింటి కుటుంబానికి చెందిన ఏడుగురిని హతమార్చాడు. కుటుంబ కలహాలు, అత్తింటి వారిపై కక్షతో ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడు. ఈ హత్యలన్నీ 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే చేశానన్నాడు. ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి పథకం ప్రకారం అంతం చేసినట్లు అంగీకరించాడు. ఈ దారుణ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ దురాగతంలో అతనికి తన కుమార్తె కూడా సహకరించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటికి పిలిచి.. రోకలితో కొట్టి..
బెంగళూరు పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని రాజాజీ నగర్ పరిధిలోని శ్రీరాంపుర భాష్యం సర్కిల్లో ఇందు శేఖర్ (45) నివసిస్తున్నాడు. ఇతనికి 20 ఏళ్ల క్రితం సునీతతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. అయితే.. భార్య తరచూ పుట్టింటికి వెళ్లడం, తమ సంసారంలో ఆమె తల్లి, సోదరుల జోక్యం పెరగడం శేఖర్‌కు నచ్చలేదు. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో అత్తంటివారిపై ద్వేషం పెంచుకున్న శేఖర్.. తొలుత తన భార్య సునీతను చంపేశాడు.
తర్వాత భార్య కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఈ విషయం గురించి మాట్లాడాలంటూ అత్త రూపవతి, ఏడేళ్ల బాలుడు పునీత్, ఇద్దరు బావమరుదులు, వారి భార్యలను ఇంటికి విడివిడిగా పిలిపించాడు. వాళ్లు రాగానే కొద్దిసేపు మాట్లాడినట్లు నటించి.. రోకలిబండతో తలపై కొట్టి హత్య చేసేవాడు. మృతదేహాలను తన క్యాబ్‌లో బెంగళూరు శివారు ప్రాంతాల్లో, నందిహిల్స్ పరిసరాల్లో వేర్వేరు చోట పడేసేవాడు. రక్తపు మరకలు, ఇతర ఆధారాలను రసాయనాలతో తొలగించేవాడు.
మైనర్ కూతురి సహకారం..?
ఇప్పటి వరకు ఒక మృతదేహం మాత్రమే లభ్యమైందని, మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరో దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే.. ఈ హత్యలు, మృతదేహాల తరలింపు, సాక్ష్యాల తొలగింపులో నిందితుడి మైనర్ కుమార్త కూడా సహకరించిందని తెలుస్తోంది. అయితే.. ఆమె పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.