పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
మంథనిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
మంథని, నవంబర్ 25 (విజయక్రాంతి): నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మవాడకు చెందిన నాయిని భవాని రాజు, నాయిని మల్లమ్మ, వడ్లవాడకు చెందిన మల్లోజు సునీత నాగరాజు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారుల కుటుంబాలను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
సొంతింటి కల నెరవేరిన కుటుంబాలతో ముచ్చటిస్తూ వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. పేద కుటుంబాలకు సొంత ఇల్లు సమకూరడం వారి జీవితాల్లో కొత్త భరోసా, భద్రతను కల్పిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.