టీఆర్‌ఎస్‌లోకి నాగోబా ప్రధాన పూజారి
- సర్పంచులు, ముఖ్య నాయకులతో పార్టీలో చేరిక
- ఇంద్రవెల్లిలో సభకు సన్నాహాలు
- 20న కొడంగల్‌లో పాంచజన్య సంకల్ప సభ
ఉట్నూర్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): నాగోబా అమ్మవారి ఆశీస్సులు తమపై సంపూర్ణంగా ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)(Telangana Rakshana Sena) చీఫ్ కల్వకుంట్ల కవిత(kalvakuntla kavitha) అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనంద రావు, పలువురు సర్పంచులు, ముఖ్యనాయకులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా కవిత వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మేస్రం ఆనందరావుతోపాటు గిన్నెర గ్రామ సర్పంచ్ మేస్రం భీమ్ రావు, ముత్నూర్ సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద గ్రామ సర్పంచ్ నగేశ్, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్, సీనియర్ నాయకులు మేస్రం దయాకర్, తొడసం సాగర్, మేస్రం జంగురావు, కోట్నక్ లక్ష్మణ్, సాయిగౌడ్, కోట్నక్ కృష్ణా తదితరులున్నారు.
ఈ కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పార్టీ సీనియర్ నాయకులు లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్‌లో ఇంద్రవెల్లి కేంద్రంగా కవిత భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. చేరికలతో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలోని పార్టీ క్యాడర్ లో జోష్ నింపాలని, పార్టీని మరింత పటిష్ఠం చేయాలని భావిస్తున్నారు.