పాత గెజిట్ ప్రకారమే రైల్వే లైన్ నిర్మించాలి

11-11-2026 | 02:05pm

బెల  నవంబర్ 11(విజయక్రాంతి): సదల్‌పూర్ గ్రామసభలో(Sadalpur Grama Sabha) తీర్మానం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ప్రజా ఉద్యమానికి(People's movement) గ్రామస్తుల మద్దతు సామ రూపేష్ రెడ్డి. మహారాష్ట్రలోని గడ్‌చందూర్ నుంచి బేల, జైనథ్ మీదుగా ఆదిలాబాద్ వరకు పాత గెజిట్ ప్రకారం రైల్వే లైన్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ బేల మండలంలోని సదల్‌పూర్ గ్రామస్తులు బుధవారం గ్రామంలో సమావేశమై తీర్మానం చేశారు.

ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించి గెజిట్ విడుదల చేసిన రైల్వే మార్గాన్ని యథాతథంగా అమలు చేయాలని కోరారు.గడ్‌చందూర్ నుంచి బేల,జైనథ్ మీదుగా ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో సులభమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు,ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.ఈ ప్రాంత అభివృద్ధికి రైల్వే లైన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ఇంతటి ముఖ్యమైన ప్రజా సమస్యపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విచారకరమన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎంపీ గోడం నగేష్,ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ రాజకీయ స్వలాభాలను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ రైల్వే లైన్ సాధన కోసం గ్రామగ్రామాన ప్రజలను చైతన్యపరుస్తూ తీర్మానాలు చేపడతామని ప్రజల ఆకాంక్ష నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సామ రూపేష్ రెడ్డి స్పష్టం చేశారు.అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పాత గెజిట్ ప్రకారం రైల్వే లైన్ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందులో గ్రామ సర్పంచ్ మార్సుకోల మంగేష్,ఉప సర్పంచ్ సంజయ్,గోరంగే శ్యామ్ రావు,గ్రామస్తులు కోరంగి వెంకట్ రావు,గణేష్, విలాస్,తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు