విలేజ్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలి
గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
తలమడుగు అక్టోబర్ 14(విజయక్రాంతి): గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) సూచించారు. బుధవారం తలమడుగు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్లోని వాహనాలు, రికార్డులను పరిశీలించారు. ప్రతి పోలీస్ సిబ్బందికి గ్రామాలను కేటాయించి విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుంటూ గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సూచించారు. గంజాయి సాగు, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, సమాచారం అందించిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, ఎస్ఐ డి. రాధిక తదితరులు పాల్గొన్నారు.