ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
చెన్నపురావుపల్లిలో గృహప్రవేశాలు చేయించిన మంత్రి జూపల్లి
పెద్దకొత్తపల్లి, అక్టోబర్ 14: అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(Kalwakurthy MLA Kasireddy Narayana Reddy), వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొంతిల్లు పేద కుటుంబాలకు భద్రత, భరోసా కల్పించడంతో పాటు జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహద పడుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మహిళలు, రైతులు, పేద కుటుంబాల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.