పవర్ కట్‌పై.. పవర్‌ఫుల్ నిరసన..

14-10-2026 | 04:00pm
  1. విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ సమరశంఖం
  2. రహదారిపై ధర్నా, రాస్తారోకో
  3. సబ్‌స్టేషన్‌ ను ముట్టడించిన బీఆర్ఎస్ శ్రేణులు
  4. గేట్లు ఎక్కి సబ్‌స్టేషన్‌లోకి..
  5. అడ్డుకున్న పోలీసులు
  6. విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరించాలని అధికారులకు వినతి

వెంకటాపూర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మండలంలో అకాల విద్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, సీనియర్ నాయకుడు మల్క రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.

అంతకుముందు పాలంపేట–పరకాల రహదారిపై సుమారు గంటపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి వెళ్లేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ నాయకులు సబ్‌స్టేషన్‌ కాంపౌండ్‌ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం అక్కడి విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రైతులకు కరెంట్ కష్టాలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయానికి విద్యుత్ ఎంతో కీలకమని, పంటలు కీలక దశలో ఉన్న సమయంలో కోతలు విధించడం వల్ల రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం, విద్యుత్ అధికారులు స్పందించి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా.?

విద్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీనియర్ నాయకులు మల్క రమేష్ అన్నారు. వరి పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించి విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే మండలవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు అశోక్, పీఏసీఎస్ చైర్మన్ గోపాల్ రావు, కుమారస్వామి, సర్పంచ్ జగన్మోహన్‌రావు, మండల సోషల్ మీడియా కన్వీనర్ నరేంద్రచారి,

ఉప సర్పంచులు ప్రకాష్, తిరుపతి, సీనియర్ యువజన నాయకులు రాజ్‌ కుమార్, దిలీప్ కుమార్, రాము, వెంకటేష్, అశోక్, నజీరుల్లా, కార్తీక్, సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, భద్రయ్య, రమేష్, మాజీ నాయకులు వీరమల్లు, రవి, జహీర్, యాదగిరి, రమేష్, సాంబయ్య, సదయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు