రాఘవేంద్ర నగర్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం
రూ.13 లక్షలతో మంచినీటి పైప్లైన్ పనులు.. పర్యవేక్షించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్
ఉప్పల్ అక్టోబర్ 14విజయక్రాంతి : హెచ్ఎంటీ నగర్ డివిజన్(HMT Nagar Division) పరిధిలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రూ.13 లక్షల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్(BRS Leader Saijen Shekhar) బుధవారం స్థానిక కాలనీవాసులతో కలిసి పర్యవేక్షించారు. పనుల పురోగతిని పరిశీలించి, నిర్ణీత సమయంలో నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ.. కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కాలనీలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మంచినీటి పైప్లైన్ పనులు పూర్తయిన వెంటనే, ఇప్పటికే మంజూరైన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కాలనీల అభివృద్ధి అనేది కేవలం రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకే పరిమితం కాకుండా, ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం కూడా ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజల సూచనలు, అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు.మంచినీటి పైప్లైన్ పనులు పూర్తయితే కాలనీవాసులకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు, తదుపరి సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలకు కూడా సౌకర్యం కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కాలనీలో మిగిలి ఉన్న సమస్యలను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి సంఘం యాదగిరి, విటల్ యాదవ్, గణేష్, వెంకటరెడ్డి తదితరులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.