కాంస్య పథకం సాధించిన భద్రాచలం క్రీడాకారుడు
- అమెరికాలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్
- భద్రాచలం వాసి సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డివి శంకర్ రావుకు కాంస్య పతక
భద్రాచలం (విజయక్రాంతి): వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని, పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా అసాధారణ విజయాలు సాధించవచ్చని తెలంగాణ రాష్ట్రానికి చెందిన 74 ఏళ్ల సీనియర్ అథ్లెట్ డివి శంకర్ రావు(Senior athlete DV Shankar Rao) నిరూపించారు. గుండెకు జరిగిన బైపాస్ సర్జరీని సైతం లెక్కచేయకుండా, తన సంకల్ప బలంతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆయన..
గురువారం అమెరికా వేదికగా జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అమెరికాలో ఈ నెల 15 నుండి 24 వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మక వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో శంకర్ రావు పాల్గొని ఈ ఘనత సాధించారు. వృద్ధాప్యంలోనూ, శారీరక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటూ ఆయన సాధించిన ఈ విజయం పట్ల భద్రాచలం ప్రాంతంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాచలానికి చెందిన ప్రముఖ సిటీ స్టైల్ జిమ్ సెంటర్ లో కోచ్ జి.వి. రామిరెడ్డి పర్యవేక్షణలో శంకర్ రావు ఈ పోటీల కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నారు. కోచ్ రామిరెడ్డి అందించిన సరైన మార్గదర్శకత్వం, శంకర్ రావు పట్టుదల కలగలిసి దేశానికే గర్వకారణమైన ఈ పతకాన్ని సాధించిపెట్టాయి.
అంతర్జాతీయ స్థాయిలో దేశం మరియు రాష్ట్రం గర్వపడేలా పతకం సాధించిన డివి శంకర్ రావును, ఆయనకు శిక్షణనిచ్చిన కోచ్ జి.వి. రామిరెడ్డిని పలువురు రాజకీయ నాయకులు, వివిధ క్రీడా సంఘాల నాయకులు పట్టణ ప్రముఖులు, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ జనరల్ సెక్రెటరీ జోసెఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి మల్లేష్ , భద్రాద్రి జిల్లా డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, పాకాల దుర్గా ప్రసాద్ , గ్రీన్ భద్రాద్రి సభ్యులు, లైన్స్ క్లబ్ సభ్యులు, రోటరీ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు , మరియు భద్రాచలo ప్రాంతవాసులు అభినందించడం జరిగింది.