చాంబర్‌ ఎన్నికల్లో కొత్త వివాదం

20-11-2026 | 04:38pm

భద్రాచలం (విజయక్రాంతి): సీతారామ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికల్లో తమను పోటీ నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని అధ్యక్ష అభ్యర్థి బచ్చు శ్రీనివాస్‌, ప్యానల్‌ సభ్యులు కల్కి వాసు శ్రీనివాస్‌, భరత్‌ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌లో లేని నిబంధనలను కొత్తగా విధించి, వాటికి అంగీకరించలేదనే కారణంతో తమను అనర్హులుగా ప్రకటించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం భద్రాచలం పట్టణంలోని పాత ఎల్ఐసీ రోడ్డులో గల ఐస్ మ్యాజిక్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

ఎన్నికల గుర్తులు కేటాయిస్తామని పిలిపించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కును వదులుకోవాలంటూ అంగీకార పత్రంపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగినా కోర్టును ఆశ్రయించకూడదనే షరతు విధించారని, దానికి అంగీకరించకపోవడంతో తమను పోటీకి అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. నామినేషన్లను ఆమోదించిన తర్వాత కొత్త నిబంధనలు తీసుకొచ్చి అనర్హులుగా ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు.

ఆగస్టు 2న సీతారామ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో సభ్యత్వ నమోదు కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. సభ్యత్వ నమోదు చేసి దరఖాస్తులను చాంబర్‌కు అప్పగించడం వరకే ఆ కమిటీ బాధ్యత అని వివరించారు. అయితే 1,091 మంది సభ్యుల నుంచి ఒక్కొక్కరికి రూ.500 చొప్పున వసూలు చేసిన మొత్తం రూ.5,45,500ను చాంబర్‌ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని లిఖితపూర్వకంగా కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు.

సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించిన కమిటీ తన పరిధిని దాటి నవంబర్‌ 8న ఆర్యవైశ్య సత్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించిందన్నారు. మొత్తం 1,091 మంది సభ్యులుండగా కేవలం 90 నుంచి 100 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. చాంబర్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉండగా, ప్రస్తుత కమిటీ రద్దయిందంటూ ఎలాంటి ఆధారాలు చూపకుండా సమావేశం నిర్వహించారని విమర్శించారు. సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండానే తాండ్ర రవణను ఎన్నికల అధికారిగా నియమించి నోటిఫికేషన్‌ విడుదల చేశారని ఆరోపించారు.

సభ్యత్వాలపై పూర్తిస్థాయి పరిశీలన జరపాలని, వసూలు చేసిన నగదును చాంబర్‌ ఖాతాలో జమ చేయాలని, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తటస్థ అధికారిని నియమించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఎన్నికలను అడ్డుకోవాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

ఈ నెల 14న తమ ప్యానల్‌ తరఫున ముగ్గురం నామినేషన్లు దాఖలు చేయగా, ఎన్నికల అధికారులు పరిశీలించి ఆమోదించారని వివరించారు. ఈ నెల 18న ఎన్నికల గుర్తుల కేటాయింపు (Election Symbols) కోసం రావాలని పిలవడంతో ముగ్గురం వెళ్లామన్నారు. తమ ప్యానల్‌కు ఒకే గుర్తు కేటాయించేందుకు అంగీకార పత్రంపై సంతకాలు చేయాలని సూచించారని తెలిపారు. సాధారణ అంగీకార పత్రమేనని భావించి సంతకాలకు సిద్ధమైనా, అందులోని కొన్ని షరతులు తమ హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని గుర్తించామన్నారు.

ఎన్నికల్లో అవకతవకలు జరిగినా న్యాయపరంగా ప్రశ్నించకూడదనే అంశాలను అంగీకార పత్రంలో చేర్చారని ఆరోపించారు. అభ్యంతరకరమైన రెండు అంశాలను తొలగిస్తే సంతకాలు చేస్తామని చెప్పినా అంగీకరించలేదన్నారు. మిగిలిన ఆరుగురు అభ్యర్థులు సంతకాలు చేశారని, తాము కూడా చేయాలని ఒత్తిడి తెచ్చారని వివరించారు. తాము ఎంపిక చేసుకున్న బంతి గుర్తును కేటాయించాలని కోరగా, అంగీకార పత్రంపై సంతకాలు చేస్తేనే గుర్తు ఇస్తామని, లేకపోతే పోటీకి అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించారని ఆరోపించారు. ఎన్నికల అధికారికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయని చెబుతూ కొద్ది నిమిషాల్లోనే తమను అనర్హులుగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల గుర్తుల కేటాయింపు కోసం సాయంత్రం 5 గంటలకు రావాలని సూచించగా, తాము 5.05 గంటలకే చేరుకుని హాజరు పుస్తకంలో సంతకాలు చేశామన్నారు. అయినప్పటికీ రాత్రి 7.20 గంటలకు వచ్చి సంతకాలు చేయకుండా వెళ్లిపోయినట్లు నమోదు చేయడం అవాస్తవమని ఖండించారు. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను నోటిఫికేషన్‌ విడుదల సమయంలోనే వెల్లడించాలని, నామినేషన్లు ఆమోదించిన తర్వాత కొత్త షరతులు విధించడం సరికాదన్నారు.

సాధారణ ఎన్నికల్లోనూ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుందని, చాంబర్‌ ఎన్నికల్లో మాత్రం ఆ హక్కును వదులుకోవాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. వ్యాపారుల హక్కుల పరిరక్షణతోపాటు ఎన్నికలు న్యాయబద్ధంగా (Fair Elections) జరిగే వరకు పోరాడతామని, తమను అనర్హులుగా ప్రకటించిన నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బచ్చు శ్రీనివాస్‌ ప్యానల్‌ సభ్యులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు