బాసరలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ జానకి షర్మిల
భైంసా (విజయక్రాంతి) : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి(Basara Sri Jnana Saraswati) అమ్మవారి ఆలయంలో మూల నక్షత్రం సందర్భంగా నిర్వహిస్తున్న మహా అక్షరాభ్యాస కార్యక్రమానికి(Literacy program) భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా పోలీసు శాఖ(Nirmal District Police Department) పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు 200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ వారికి సహకరించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకొని, తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవాలని సూచించారు. అంతకుముందు ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.