ఉచిత కూరగాయల అంటుకట్టుటలో శిక్షణ
- ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మందమకరందు..
- దేశంలోనే తొలిసారిగా గిరిజన మహిళలకు ప్రొఫెషనల్ గ్రాఫ్టర్ గా శిక్షణ..
ఉట్నూర్, అక్టోబర్ 16( విజయక్రాంతి ): గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం హైదరాబాద్ కాన్హా శాంతి వనంలోని(Kanha Shanti Vanam, Hyderabad) హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెజిటబుల్ గ్రాఫ్టింగ్ స్కిల్ అకాడమీలో(Vegetable Grafting Skill Academy) 7 రోజుల ఉచిత నివాస శిక్షణకు 35 మంది గిరిజన మహిళలను ఎంపిక చేయనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు తెలిపారు.
శుక్రవారం ప్రాజెక్టు అధికారి క్యాంపు కార్యాలయం లో మాట్లాడుతూ... కూరగాయల అంటుకట్టుట
అధిక దిగుబడినిచ్చే టమాటా, వంకాయ, మిర్చి, దోస, పుచ్చకాయ మొక్కల పైభాగాన్ని, తెగుళ్లను తట్టుకునే బలమైన వేర్లు గల మొక్కకు అంటుకట్టడమే గ్రాఫ్టింగ్ విధానం వల్ల 90% వరకు నేల ద్వారా వచ్చే తెగుళ్లు నివారించబడతాయి అన్నారు. పురుగు మందుల వాడకం తగ్గి, పంట నష్టం తగ్గుతుందని వాతావరణ మార్పులను తట్టుకుని రైతుకు స్థిరమైన దిగుబడి వస్తుందని అన్నారు.
గిరిజన మహిళలకు ఎందుకు ఉపయోగం..
దేశవ్యాప్తంగా గ్రాఫ్టింగ్ పరిశ్రమ 200% వృద్ధి చెందుతోంది, నైపుణ్యం కలిగిన గ్రాఫ్టర్లకు తీవ్ర కొరత ఉందన్నారుఇంటి వద్ద కూర్చొని చేసే పని పొలం పని కాదని అన్నారు.నీడలో టేబుల్ వద్ద కూర్చొని చేసే సురక్షితమైన పని. ఓర్పు, నైపుణ్యం ఉంటే చాలు అన్నారు.
ఒక సీజన్ ఆదాయం = ఒక సంవత్సర ఆదాయం..
కేవలం 2-3 నెలల సీజనల్ పనిలోనే సంవత్సర ఆదాయం సంపాదించ వచ్చునని,భూమి, పెట్టుబడి అవసరం లేదని 35 మంది మహిళలు 3 ఏళ్లలో 1.9 కోట్ల అంటు మొక్కలు తయారు చేసి, 4,740 ఎకరాలకు సరిపడా మొక్కలు అందించగలరని, దీని ద్వారా రూ. 3.15 కోట్ల ఆదాయ సామర్థ్యం ఉందన్నారు..
హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ఉచితంగా కల్పించే సౌకర్యాలు..
7 రోజుల నివాస, ప్రాక్టికల్ శిక్షణ, సురక్షిత వసతి, భోజనం, ప్రయాణ ఖర్చులు.శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్ మరియు ప్రతిభ కనబరిచిన వారికి నర్సరీలలో 2-3 నెలల పాటు ఉద్యోగ కల్పనలో సాయం చేస్తారని అన్నారు.
అర్హతలు.. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న గిరిజన మహిళలు, 2-3 నెలలు బయట నర్సరీలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. మంచి కంటి చూపు, చేతులు స్థిరంగా ఉండాలి. ఒకే గ్రామం / స్వయం సహాయక సంఘం నుండి ఉంటే ప్రాధాన్యత ఉంటుందని పిఓ గుర్తు చేశారు.
ఆసక్తి గల గిరిజన మహిళలు పూర్తి వివరాలకు ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్, ఐటీడీఏ, ఉట్నూర్ వారిని సంప్రదించాలని ప్రాజెక్ట్ అధికారి కోరారు. శిక్షణ అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ 2026 లో నిర్వహించబడుతుందని పిఓ వివరించారు.