గుట్కా దందాపై ఉదాసీనత!
- యువతను వ్యసనాల ఊభిలోకి నెడుతున్న పొగాకు ఉత్పత్తులు
- బహిరంగంగానే సాగుతున్న అక్రమ దందా
- పట్టించుకోని పోలీసులు.. మండల అధికారులు
- ప్రశ్నార్థకంగా మారిన నిఘా వ్యవస్థ
గుండాల, నవంబర్ 24 (విజయక్రాంతి): మండల కేంద్రంలో గుట్కా, ఖైనీ,(Gutka, Khaini) తదితర నిషేధిత పొగాకు(Prohibited tobacco) ఉత్పత్తుల అక్రమ విక్రయాలు(Illegal sales of products) జోరుగా సాగుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా వివిధ వార్త పత్రికలలో(Newspapers) గుట్కా దందాపై పలుమార్లు కథనాలు ప్రచురించినా కూడా నిఘా వ్యవస్థలో చలనం రాకపోవడం పట్ల అధికారులు ఈ దందా నిర్వహిస్తున్న వ్యక్తులతో కుమ్మక్కు అయినట్లు పలు అనుమానాలకు దారి తీస్తుందని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
చట్టం నిషేధించిన ఉత్పత్తులు బహిరంగంగానే అందుబాటులో ఉంటున్నా అడ్డుకట్ట వేసే చర్యలు మాత్రం కొరవడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమ వ్యాపారులకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం కొంత వరకూ ఈ వ్యాపారంపై సడలింపులు ఇచ్చినా గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు దుకాణాల్లో బహిరంగంగానే విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యువత, విద్యార్థులు సైతం ఈ వ్యసనాలకు బానిసలవుతున్న పరిస్థితి రోజురోజుకీ ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై నిఘా పెట్టాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడం వ్యాపారులకు వరంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసుల నిఘా కరువు
మండల కేంద్రంలో అక్రమ గుట్కా వ్యాపారం జోరుగా జరుగుతున్నట్లు తెలిసినా కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారా..? లేక గుట్కా దందా చేసే వారితో కుమ్మక్కయ్యారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే వ్యాపారులకు పరోక్షంగా ప్రోత్సాహం ఇచ్చినట్లేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
యువత భవిష్యత్తుతో చెలగాటం..!
తక్కువ వయసులోనే పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్న యువత ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. గుట్కా, ఖైనీ, సిగరెట్ వినియోగం నోటి క్యాన్సర్ తో సహా పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట పడకపోవడం విచారకరం.
ఇప్పటికైనా చలనం వచ్చేనా..?
సంబంధిత పోలీసులు, ఆహార భద్రత అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిల్వలు, సరఫరా మార్గాలు, విక్రయ కేంద్రాలను గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పునరావృతం కాకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా గుట్కా దందాపై పోలీస్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడక తప్పదని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.