ఫీజు.. బేజారు!
రీయింబర్స్మెంట్ చెల్లింపులపై ప్రభుత్వం పేచీ
- రూ. 8,591 కోట్లకు చేరిన బకాయిలు
- మూడేండ్లలో చెల్లించాల్సినవే రూ. 7,673 కోట్లు
- ఏటేటా తగ్గుతున్న చెల్లింపులు
- 2025--26లో బీసీ స్టూడెంట్లకు 96.63 శాతం పెండింగ్
- అదే ఏడాది మైనారిటీ విద్యార్థులకు ఒక్క రూపాయీ విడుదలకాలే
- సర్టిఫికెట్లు అందక, పైచదువులకు వెళ్లలేక పిల్లల అవస్థలు
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల(Fee reimbursement dues) సమస్య విద్యార్థుల(Students') భవిష్యత్తును వెంటాడుతున్నది. ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశతో కాలేజీల్లో చేరిన పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యం శాపంగా మారుతున్నది. ఒకవైపు కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల(Students certificates) కోసం ఎదురుచూస్తుండగా.. మరోవైపు చివరి సంవత్సరం చదువుతున్నవారు పరీక్షలు, ఉన్నత విద్య ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాల విషయంలో ఆందోళన చెందాల్సి వస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యకు శాశ్వ త పరిష్కారం లభించడం లేదని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.
తగ్గుతున్న చెల్లింపులు..
గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 2025--26 విద్యా సంవత్సరం వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8,591 కోట్లకు చేరాయి.
2023-24 నుంచి 2025--26 వరకు మూడేండ్లలో రూ.7,673 కోట్ల ఫీజు చెల్లింపుల డిమాండ్ ఉండగా.. ఇప్పటివరకు విడుదలైన మొత్తం రూ.2,160 కోట్లు మాత్రమే. అంటే కేవలం 28 శాతం నిధులే విడుదలయ్యాయి. ఇంకా రూ.5,513 కోట్లు(72 శాతం) పెండింగ్‌లోనే ఉన్నాయి. విద్యా సంవత్సరాల వారీగా పెండింగ్ బకాయిలను పరిశీలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. 2023--24లో రూ.2,719 కోట్ల డిమాండ్‌కు గాను రూ.1,110 కోట్లు విడుదలయ్యాయి. అంటే 40.82 శాతం చెల్లింపులు జరిగాయి.
2024--25లో రూ.2,761 కోట్ల డిమాండ్ ఉండగా రూ.876.03 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. చెల్లింపుల శాతం 31.73కు పడిపోయింది. ఇక 2025--26లో రూ.2,193 కోట్ల డిమాండ్‌కు గాను విడుదలైన మొత్తం కేవలం రూ.173 కోట్లు. అంటే 7.92 శాతం మాత్రమే చెల్లింపులు జరిగాయి. వరుసగా మూడేండ్లలో చెల్లింపుల శాతం తగ్గుతూ రావడం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు కూడా పెండింగ్‌లో చేరితే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
బీసీ, మైనారిటీ విద్యార్థులకు అందని ఆర్థిక భరోసా
* ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ కారణంగా బీసీ, మైనారిటీ విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
* 2025-26 విద్యా సంవత్సరంలో 3,62,065 మంది బీసీ విద్యార్థులకు సంబంధించి రూ. 922.92 కోట్ల ఫీజు బకాయిల్లో 96.63 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 2024--25లో 4,82,524 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.1,176.92 కోట్లలో దాదాపు 98 శాతం చెల్లించాల్సి ఉంది. 2023-24లోనూ రూ.1,207.19 కోట్ల బకాయిల్లో 64 శాతం పెండింగ్‌లో ఉన్నాయి. అంటే అత్యధికంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడే బీసీ విద్యార్థులు వరుసగా మూడు విద్యా సంవత్సరాలుగా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.
* మైనారిటీ విద్యార్థులకు సంబంధించి 2025--26లో 89,118 మంది విద్యార్థులకు చెందిన రూ.251.86 కోట్ల ఫీజు బకాయిల్లో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. 2024--25లో 1,19,066 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.375.80 కోట్లలో 99.89 శాతం పెండింగ్‌లో ఉంది. 2023--24లో 1,32,246 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.388.10 కోట్లలో 81 శాతం చెల్లించాల్సి ఉంది.
సర్టిఫికెట్లను ఇవ్వని యాజమాన్యాలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్య ప్రస్తుత విద్యార్థులకే పరిమితం కావడం లేదు. ఇప్పటికే కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థుల భవిష్యత్తుపైనా ప్రభావం చూపుతున్నది. కొన్ని విద్యాసంస్థల్లో ఫీజు బకాయిల కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నారనే అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తదుపరి విద్య కోసం ఇతర సంస్థల్లో చేరాలన్నా, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా సర్టిఫికెట్లు తప్పనిసరి.
ఈ సమయంలో అవి అందుబాటులో లేకపోతే అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉంది. కొందరు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు సాధించినా అవసరమైన ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి కూడా సర్టిఫికెట్ల జాప్యం సమస్యగా మారుతున్నది. ఒకవైపు చదువులు పూర్తిచేసుకుని జీవితంలో తదుపరి అడుగు వేయాల్సిన సమయంలో మరోవైపు ఫీజు బకాయిల సమస్య ఎదురుకావడం విద్యార్థుల్లో నిరాశను పెంచుతున్నది.
కొత్త విధానం సరే.. పాత బకాయిల సంగతేంటి?
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు 2026--27 విద్యా సంవత్సరం నుంచి ముందస్తు చెల్లింపుల విధానం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఏటా రూ. 2,400 కోట్లను ముందుగానే బ్యాంకులో ఉంచి విద్యార్థుల ఖాతాలకు నేరుగా చెల్లించే విధానం తీసుకొస్తామని ఇటీవల తెలిపారు. ఈ ఏడాదికి రూ. 250 కోట్లు కేటాయించినట్లు కూడా వెల్లడించారు. అయితే కొత్త విధానం కంటే పాత బకాయిల పరిష్కారంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2023--24, 2024--25, 2025--26 విద్యా సంవత్సరాలకు సంబంధించి పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారనే దానిపై స్పష్టత లేదు. మొత్తం బకాయిలపై ఒకే అధికారిక శ్వేతపత్రం విడుదల చేయాలని.. ఏ విద్యా సంవత్సరానికి ఎంత డిమాండ్ ఉంది? ఎంత విడుదలైంది? ఎంత పెండింగ్‌లో ఉంది? ఎన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభావితమవుతున్నారు? అన్న వివరాలు బహిర్గతం చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
బకాయిలు ఏటేటా పెరుగుతున్నా చెల్లింపులకు స్పష్టమైన కాలపరిమితి లేకపోవడం విద్యార్థుల్లో అనిశ్చితిని పెంచుతున్నది. ప్రభుత్వం కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేసే సమయంలోనే గత సంవత్సరాల బకాయిలను కూడా పరిష్కరించాల్సి ఉంటుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.
తల్లిదండ్రులపై మళ్లీ భారం
పేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, చిరుద్యోగుల కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం లక్ష్యం. అయితే ప్రభుత్వం నుంచి ఫీజుల సొమ్ము సకాలంలో అందకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి పెంచుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి.
ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందన్న నమ్మకంతో పిల్లలను ఉన్నత విద్యలో చేర్పించిన తల్లిదండ్రులు ఇప్పుడు మళ్లీ డబ్బులు సమకూర్చాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఇంటి ఖర్చులు, పిల్లల ఇతర విద్యా అవసరాలు, రవాణా, వసతి ఖర్చులతో సతమతమవుతున్న కుటుంబాలకు అదనంగా కాలేజీ ఫీజులు చెల్లించడం భారంగా మారుతున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందకపోవడంతో కొందరు విద్యార్థులు చదువును కొనసాగించాలా వద్దా అన్న ఆలోచనలో పడుతున్నారు.