బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్తుకు పునాది

20-11-2026 | 06:20pm

జిల్లా సంక్షేమ అధికారిణి కే.ఎం.తార 

చుంచుపల్లి, నవంబర్ 20,(విజయక్రాంతి): బాలలే దేశ భవిష్యత్తుకు నిజమైన సంపద అని, ప్రతి బాలబాలికకు(Boys and girls) సురక్షితమైన బాల్యం, నాణ్యమైన విద్య(Quality Education), మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ(District Department of Women and Child Welfare) అధికారి కే.ఎం.తార పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం(International Childrens Day) సందర్భంగా శుక్రవారం స్థానిక చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో  నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములై బాలల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాలలకు ప్రేమ, ఆప్యాయత, భద్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించడంతో పాటు వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఎంతో అవసరమని తెలిపారు.బాలలందరికీ విద్య అందుబాటులో ఉండాలని, పేదరికం, సామాజిక అసమానతలు, ఇతర కారణాల వల్ల ఏ ఒక్క బాలుడు కూడా విద్యకు దూరం కాకూడదని పేర్కొన్నారు. బాలల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం, పరిశుభ్రత, వైద్య సేవలు, మానసిక ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకమని వివరించారు.

ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక వేధింపులు, హింస, నిర్లక్ష్యం, బాలల అక్రమ రవాణా వంటి సామాజిక దురాచారాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాలలపై ఎక్కడైనా హక్కుల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి వారికి తగిన రక్షణ, న్యాయం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాల బాలల సంరక్షణ అధికారి హరి కుమారి, మహిళా సాధికారత సిబ్బంది సౌజన్య, షీటీం ఎస్ఐ రమాదేవి, డిసిపియు సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు