పేదల ఆత్మగౌరవానికి పెన్షన్లు కొండంత అండ
- అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
- మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం
- అధైర్యపడొద్దు..అందరికీ ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్లు అందిస్తాం
- కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం : టౌన్ నవంబర్ 13 (విజయక్రాంతి) : నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల(destitute, widows, single women, and persons with disabilities) ఆత్మగౌరవానికి చేయూత పెన్షన్లు(Cheyutha Pensions) కొండంత అండగా నిలుస్తాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kothagudem MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పట్టణంలో నూతనంగా మంజూరైన 1,185 చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను శుక్రవారం కొత్తగూడెం క్లబ్బులో జరిగిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ఈ పింఛన్లు వెలుగులు నింపుతాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన నేపథ్యంలో, నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు.
మురుగునీటి వ్యవస్థ, అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి కార్పొరేషన్‌కు కొత్త రూపునిస్తామని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు చేరినప్పుడే వాటికి సార్థకత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ డిప్యూటీ మేయర్ లలిత కుమారి, ప్రజా ప్రతినిధులు పసుపులేటి వీరబాబు, లాల్ సింగ్, మండే హనుమంతరావు, నాయకులు నాగ సీతారాములు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, ఎస్ కే ఫహీం, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.