నేర నియంత్రణ, శాంతి భద్రత పరిరక్షణ
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, నవంబర్ 13 ( విజయ క్రాంతి ): సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి నేరాల నివారణకు ప్రాధాన్యత ఇస్తూనే, జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించి బాధితులకు న్యాయం అందించే విధంగా పోలీస్ అధికారులు(Police officials), సిబ్బంది పనిచేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్(District SP Ashok Kumar) సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ క్రైమ్ మీటింగ్లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నమోదైన నేరాల పరిస్థితి, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, చార్జ్షీట్లు, నేర నియంత్రణ చర్యలు, శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రత, తదితర అంశాలపై ఎస్పీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణ, విచారణా వ్యవస్థను వేగవంతం చేయడం, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడం ,ప్రతి కేసు విచారణ నాణ్యతతో పాటు సాక్ష్యాధారాల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ అప్డేషన్, ఈ-సాక్ష్య, ఐ రాడ్ అప్లికేషన్ల వినియోగం, వాటి అప్డేషన్పై సమీక్షించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పోలీస్ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు.
పెండింగ్ కేసులను ప్రాధాన్యతగా తీసుకొని కోర్టుల్లో శిక్షల శాతం (Conviction Rate ) పెంచేలా కృషి చేయాలి అన్నారు. మహిళా భద్రత, మత్తుపదార్థాల నివారణ , చోరీలు వంటి అంశాలపై క్షుణ్ణంగా విశ్లేషించారు. ప్రతి స్టేషన్లో విజబుల్ పోలీసింగ్ పెంచాలని, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పి నమ్మకం పెంచేలా ప్రవర్తించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల్లో అవగాహన కల్పించడంలో సైబర్ టీములు చురుకుగా పనిచేయాలని సూచించారు.
నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో, గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పోక్సో, గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్షీట్లు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను ఒక్కొక్కటిగా పరిశీలించి, వాటి అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
పీఎం రహత్ ( PM-RAHAT ) పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ పథకం అమలులో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబరుస్తూ, ఫంక్షనల్ వర్టికల్స్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సిబ్బందిని, నేరస్తులకు శిక్ష పడేలా కేసుల్లో సమర్థవంతమైన దర్యాప్తు చేసి కోర్టుల్లో నేర నిర్ధారణకు కృషి చేస్తున్న పోలీసు సిబ్బందిని గుర్తించి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పి చేతన్ నితిన్, డిఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, రవి కుమార్, ఇన్స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, రామ్ నరసింహ రెడ్డి, సుధాకర్, సురేష్ బాబు, శ్రీనివాస్, తిరుపతి, కరుణాకర్, రాజ్ కుమార్, వేణు, సైదులు, ఎస్.ఐ లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.