నడిరోడ్డుపై పులుల గుంపు.. బెంబేలెత్తిన వాహనదారులు

13-11-2026 | 06:50pm

మహారాష్ట్ర: అడవిలో కనిపించాల్సిన పులుల(Tigers) కుటుంబం ఒక్కసారిగా రోడ్డుపై ప్రత్యక్షమైంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా(Chandrapur District) చిమూర్ ప్రాంతం పల్సగావ్ రహదారిపై ఒక పులి తన నాలుగు పిల్లలతో కలిసి సంచరించింది. ఈ అరుదైన దృశ్యాలను అటుగా వెళ్తున్న వాహనదారులు తమ ఫోన్లలో చిత్రీకరించడంతో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. జునాబాయి అనే పులి తన నాలుగు పిల్లలతో కలిసి సాయంత్రం వేళ అడవి నుంచి రోడ్డుపైకి వచ్చింది. తల్లి ముందు నడుస్తుండగా పిల్లలు దాని చుట్టూ తిరుగుతూ కనిపించారు. పులుల గుంపును చూసిన వాహనదారులు తమ వాహనాలను నిలిపివేసి ఈ దృశ్యాలను ఆసక్తిగా వీక్షించారు.

వీడియో వైరల్ కావడంతో స్థానికంగా పులుల సంచారంపై చర్చ మొదలైంది. అటవీ ప్రాంతాలకు సమీపంలోని రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పులులు కనిపించినప్పుడు వాహనాల నుంచి బయటకు రావడం, వాటి దగ్గరకు వెళ్లడం, చుట్టుముట్టడం వంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. సురక్షిత దూరం పాటిస్తూ వన్యప్రాణుల సంచారానికి ఆటంకం కలిగించకుండా వ్యవహరించాలని సూచించారు.


మరిన్ని వార్తలు