ఖాకీ దుస్తుల్లో మెరవాలన్న కలను సాకారం చేసుకోండి

13-11-2026 | 06:49pm

* మీ విజయానికి..మా మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటుంది

* నిరుద్యోగ యువతకు మంత్రి పొంగులేటి భరోసా

* పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ శిబిరం సందర్శన

* అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

ఖమ్మం: పోలీసు ఉద్యోగం(Police job) సాధించాలన్న లక్ష్యంతో కష్టపడుతున్న నిరుద్యోగ యువత(Unemployed youth) తమ కలలను సాకారం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఆకాంక్షించారు. పట్టుదల, క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఖాకీ దుస్తుల్లో(Khaki uniforms) మెరవాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. వారి విజయానికి అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా ఇచ్చారు.

పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్, రైట్ ఛాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని మంత్రి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడి శిక్షణ, సన్నద్ధత తీరును తెలుసుకున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక భారం లేకుండా పోలీసు ఉద్యోగాలు సాధించే అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో ఎంత వ్యయమైనా వెనుకాడకుండా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ కోచింగ్ కార్యక్రమానికి ఏకంగా 1,25,000 మంది దరఖాస్తు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఖమ్మంలో శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న రైట్ ఛాయిస్ అకాడమీ ఛైర్మన్ మెడెం కిరణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అభ్యర్థులకు 16 పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. శిక్షణ అందిస్తున్న అధ్యాపక బృందాన్ని సత్కరించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులంతా.. మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో..: మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ తమ్మినేని నవీన్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు