వరి విత్తనోత్పత్తి పొలాల పరిశీలన.. మిర్చి రైతులకు సూచనలు
టేకులపల్లి, (విజయక్రాంతి): మండలంలోని ప్రగళ్లపాడు గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కొత్తగూడెం ఆధ్వర్యంలో పీఏసీఎస్ సొసైటీ సహకారంతో రైతులు సాగు చేస్తున్న వరి విత్తనోత్పత్తి పొలాలను కేవీకే కోఆర్డినేటర్ భరత్(KVK Coordinator Bharat) శుక్రవారం పరిశీలించారు. పొలాల్లో ఇతర రకాల విత్తనాల కల్తీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి పంటను ఆశించే దోమ నివారణకు ట్రైఫ్లుమెజోపైరిమ్ (పెక్సలోన్) మందును పిచికారీ చేయాలని రైతులకు వివరించారు.
అనంతరం సులానగర్ గ్రామంలో మిర్చి పంటలను పరిశీలించారు. అధిక నేల తేమ కారణంగా వేర్లు పోషకాలను సక్రమంగా గ్రహించలేక మొక్కలు వాడిపోతున్నాయని గుర్తించారు. నివారణకు 19:19:19 లేదా మల్టీ-కే ఎరువును లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మిర్చి తోటల్లో పురుగుల ఉనికిని గమనించినప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టాలని, క్లోరిపైరిఫాస్ మందు పిచికారీ చేయాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్, సీఈవో ప్రేమాచారి, ఏవో అన్నపూర్ణ, రైతులు పాల్గొన్నారు.