కర్రెగుట్టల్లో భారీ మావోయిస్టు డంపింగ్ స్వాధీనం
711 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ షెల్స్ లభ్యం
ప్రజలు గుట్టల వైపు వెళ్లవద్దని హెచ్చరిక
చర్ల, నవంబర్ 6: విజయక్రాంతి: తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని(Telangana - Chhattisgarh border) కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు(Security forces) భారీ మావోయిస్టు డంపింగ్(Maoist dumping) ను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు అడవిలో దాచి ఉంచిన 711 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్(Barrel grenade launcher) ( బిజిఎల్ ) షెల్స్ ను బలగాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి.
నవంబర్ 5న అర్ధరాత్రి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బీజాపూర్ జిల్లా పోలీసులు(Bijapur District Police), సీఆర్పీఎఫ్ 196వ బెటాలియన్, 204 కోబ్రా బెటాలియన్ సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడపాల గ్రామంలోని ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ( ఎఫ్ ఓ బి ) కు నార్త్-వెస్ట్ దిశలో సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న కేజీ హిల్స్ అడవిలో ఈ డంప్ లభించింది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను భద్రతా ప్రమాణాల ప్రకారం సురక్షితంగా భద్రపరిచారు.
ఈ నేపథ్యంలో పోలీసులు స్థానిక ప్రజలను హెచ్చరించారు. కర్రెగుట్ట, చుట్టుపక్కల కొండ ప్రాంతాలకు ప్రస్తుతానికి ఎవరూ వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతంలో ఇంకా భారీగా మందుపాతరలు ( ఐ ఈ డి), ఇతర పేలుడు పదార్థాలు దాచి ఉంచే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. డంప్ లభ్యమైన ప్రాంతాన్ని సురక్షితంగా మార్చేందుకు త్వరలోనే డీ-మైనింగ్ ఆపరేషన్ చేపట్టనున్నారు.
కర్రెగుట్ట కొండలు గతంలో మావోయిస్టు అగ్రనేతలకు సురక్షిత స్థావరంగా ఉండేవి. గత ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఇదే ప్రాంతంలో 21 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ లో కనీసం 31 మంది మావోయిస్టులు హతమయ్యారు.