కర్రెగుట్టల్లో మావోయిస్టుల భారీ డంప్
- బయటపడ్డ 711 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ షెల్స్
- స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
- అటుగా వెళ్లొద్దని స్థానికులకు సూచన
- మరిన్ని డంప్‌లు ఉండొచ్చని అనుమానం
- కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
చర్ల, నవంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల భారీ డంప్ బయటపడింది. అడవిలో దాచి ఉంచిన 711 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (బీజీఎల్) షెల్స్ (Grenade Launcher Shells) ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గురువారం అర్ధరాత్రి వచ్చిన సమాచారం మేరకు బీజాపూర్ జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 196వ బెటాలియన్, 204 కోబ్రా బెటాలియన్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. తాడపాల గ్రామం ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్‌వోబీ)కు నార్త్-వెస్ట్ దిశలో సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న కేజీ హిల్స్ అడవిలో ఈ పేలుడు పదార్థాలు కనిపించాయి.
వాటిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా ఎక్కడైనా డంప్ ఉందా అని సెర్చ్ చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ సహా దేశంలో మావోయిస్టులను ఏరిపారేశామని, మావోయిస్టు ముక్త్ భారత్ అంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 31న అధికారికంగా ప్రకటించగా.. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో మావోయిస్టుల భారీ డంప్ బయటపడటం కలకలం రేపింది. అయితే.. ఇవి గతంలో మావోయిస్టులు దాచిపెట్టినవిగా బలగాలు అనుమానిస్తున్నాయి.
అటుగా వెళ్లొద్దని స్థానికులకు సూచన
మావోయిస్టుల భారీ డంప్ బయటపడటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కర్రెగుట్టలోకి వెళ్లొద్దని స్థానికులకు సూచించాయి. ఈ అడవుల్లో మావోయిస్టులు గతంలో అమర్చిన మందుపాతరలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు, పేలని ఇతర మందుగుండు సామగ్రి ఉండే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే తాకొద్దని.. వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. త్వరలో అడవుల్లో పేలుడు పదార్థాలన్నింటినీ గుర్తించి నిర్వీర్యం చేస్తామన్నారు.
డంప్ లభ్యమైన ప్రాంతాన్ని సురక్షితంగా మార్చేందుకు డీ-మైనింగ్ ఆపరేషన్‌ను బలగాలు చేపట్టనున్నాయి. కాగా, అక్టోబర్ 6న దంతేవాడ జిల్లాలోనూ ఏకే రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, ఆరు నాటు తుపాకులు, ఒక బారెల్ గ్రెనేడ్ లాంచర్, మందుగుండు సామగ్రి, టిఫిన్ బాంబులు, కుక్కర్ బాంబులు, ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చంద్రమోహన్ సింగ్ తెలిపారు. కర్రెగుట్ట కొండలు గతంలో మావోయిస్టు అగ్రనేతలకు సురక్షిత స్థావరంగా ఉండేవి. వరుసగా జరిగిన ఆపరేషన్స్‌లో పలువురు మావోయిస్టులు చనిపోగా.. చాలా మంది లొంగిపోయారు.