మల్కారం వైద్య విద్యార్థినికి గోల్డ్ మెడల్
ఎండి జనరల్ మెడిసిన్ లో ప్రతిభ
రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకునేందుకు ఎంపికైన విద్యార్థిని
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని మల్కారం గ్రామానికి చెందిన లక్కదాసు పల్లయ్య-పద్మావతి దంపతుల కుమార్తె సాయి వినీల ఎండీ జనరల్ మెడిసిన్(MD General Medicine) పూర్తి చేసి, రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్(Gold Medal) అందుకునేందుకు ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు, మున్నూరు కాపు సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినీల సాధించిన ఈ ఘనత మల్కారం గ్రామానికే కాకుండా దమ్మపేట మండలానికి గర్వకారణమని అన్నారు.
ఆమె ప్రతిభకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ కు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు(Students) కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సాయి వినీల విజయం నిరూపిస్తోందని వారు అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వైద్య రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు. సాయి వినీల మరింత ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్నూరు కాపు సంఘం నాయకులు, గ్రామ పెద్దలు సాయి వినీలను, ఆమె కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవిరాంబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నంశెట్టి యుగంధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కక్కిరాల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వనమాల శ్రీనివాసరావు, మున్నూరు కాపు సంఘం నాయకులు చిన్నంశెట్టి సత్యనారాయణ, వనమాల సూరిబాబు, చిన్నంశెట్టి గోపి, మధు, మల్లారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాముల ప్రసాద్, టౌన్ అధ్యక్షుడు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొని సాయి వినీలను అభినందించారు.