సింగిరెడ్డిపల్లి పేరుతో ఇసుక పూడికతీత..
- భూపతిరావుపేటలో డంపింగ్ దందా!
- ఒకచోట ప్రభుత్వ ప్రతిపాదనలు.. మరోచోట ఇసుక నిల్వలు!
- 1.87 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకపై అంతుచిక్కని వ్యవహారం..
- గిరిజన సొసైటీకి దక్కే లాభాలెంత? తెరవెనుక వ్యాపారం చేసేదెవరు?
- పంచాయతీ తీర్మానం నుంచి ఇసుక తరలింపు వరకు అధికారుల పర్యవేక్షణ ఏది?
పినపాక, నవంబర్ 18,(విజయక్రాంతి): గోదావరి నది(Godavari River)లో ఇసుక పూడికతీత పేరుతో సాగుతున్న వ్యవహారం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సీతమ్మసాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో భారీ మొత్తంలో ఇసుక పూడికతీతకు ప్రభుత్వ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. మరోవైపు భూపతిరావుపేట ప్రాంతంలో ఇసుక డంపింగ్ జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
సింగిరెడ్డిపల్లి పేరుతో అనుమతులు, భూపతిరావుపేట వద్ద ఇసుక నిల్వలు, జానంపేట మీదుగా రవాణా జరుగుతోందన్న అనుమానాలు ఇప్పుడు పలు ప్రశ్నల ను లేవనెత్తుతున్నాయి. అసలు పూడికతీత ఎక్కడ? ఇసుక నిల్వలు ఎక్కడ? తరలింపునకు అనుమతులు ఎవరిచ్చారు? గిరిజన సొసైటీకి దక్కాల్సిన ప్రయోజనాలు ఎవరికి చేరుతున్నాయి? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
1.87 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకకు ప్రతిపాదన!
తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGMౄC) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాజెక్ట్ అధికారి జి. శంకర్ 26-05-2026న సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శికి పంపిన లేఖలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సీతమ్మసాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు గోదావరి నది ముంపు ప్రాంతంలో 93,750 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1,87,500 క్యూబిక్ మీటర్ల ఇసుక పూడికతీతకు సంబంధించిన ప్రతిపాదనను ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్, డీఎల్‌ఎస్‌సీకి సంబంధించిన గత ఉత్తర్వులను కూడా ప్రస్తావించారు.
ఇంత భారీ మొత్తంలో ఇసుక పూడికతీతకు సంబంధించిన వ్యవహారంలో గ్రామపంచాయతీ తీర్మానం కీలకంగా మారింది. TGMDCకి అనుకూలంగా తీర్మానం పంపించాలని ప్రాజెక్ట్ అధికారి గ్రామపంచాయతీ కార్యదర్శిని కోరినట్లు పత్రంలో స్పష్టంగా ఉంది.
గిరిజన సొసైటీ పేరు.. రూ.146 ప్రస్తావన!
ఈ పూడికతీత వ్యవహారంలో శ్రీ సమ్మక్క సారక్క మహిళా గిరిజన ఇసుక క్వారీ కార్మికుల సహకార సంఘం పేరును అధికారులు ప్రస్తావించారు. మద్దులగూడెం కేంద్రంగా నమోదైన ఈ సొసైటీకి సంబంధించిన వివరాలను జిల్లా సహకార అధికారి సమర్పించి నట్లు లేఖలో పేర్కొన్నారు.అంతేకాకుండా ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.146 చొప్పున లాభాల పంపిణీకి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. గిరిజనుల మధ్య లాభాలను సమానంగా పంపిణీ చేయాలని లేఖలో కోరారు.అయితే ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఈ రూ.146 ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? మొత్తం 1,87,500 క్యూబిక్ మీటర్లకు వర్తిస్తుందా? సొసైటీ సభ్యులకు ఎంత మొత్తం అందుతుంది? ఇప్పటివరకు ఎంత చెల్లించారు? లాభాల పంపిణీకి సంబంధించిన పూర్తి ఒప్పందం ఏమిటి? అనే అంశాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
ఒకచోట పూడికతీత.. మరోచోట ఇసుక డంపింగ్?
సింగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో పూడికతీతకు సంబంధించి అధికారిక పత్రాలు ఉండగా.. భూపతిరావుపేట ప్రాంతంలో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయన్న ఆరోపణలు మరో కోణాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఇసుక రవాణాకు సంబంధించి జానంపేట మార్గం కూడా చర్చకు వస్తోంది.అయితే సింగిరెడ్డిపల్లి పూడికతీతకు సంబంధించిన ఇసుకే భూపతిరావుపేటలో నిల్వ చేస్తున్నారా? అక్కడి నిల్వలకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లు ఉన్నాయా? రవాణా చేసిన వాహనాల వివరాలు ఏమిటి? రవాణా పర్మిట్లు, ట్రాన్సిట్ పాసులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.పూడికతీత ప్రాంతం ఒకచోట ఉండి, ఇసుక నిల్వలు మరోచోట కనిపిస్తే వాటి మధ్య సంబంధాన్ని అధికారిక రికార్డులతో నిర్ధారించాల్సి ఉంటుంది. అనుమతించిన పరిమాణానికి మించి ఇసుక తరలింపు జరిగిందా? అనుమతించిన ప్రాంతం వెలుపల నిల్వలు ఏర్పాటు చేశారా? అన్నది కూడా తేలాల్సి ఉంది.
PESA చట్టం పేరుతో గిరిజనులకు నిజంగా ప్రయోజనమా?
TGMDC లేఖలో PESA Rules, 2011లోని రూల్ 7ను ప్రస్తావించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో చిన్న తరహా ఖనిజాల వినియోగానికి స్థానిక గిరిజనులకు, పూర్తిగా స్థానిక ఎస్టీ సభ్యులతో ఏర్పడిన సొసైటీలకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు.గ్రామపంచాయతీ నిర్ణయం అంతిమమైనదని కూడా లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ నిబంధనల ప్రకారం గ్రామసభ, గ్రామపంచాయతీకి ఉన్న అధికారాలు, సొసైటీకి పని అప్పగించే విధానం, లాభాల పంపిణీ వంటి అంశాలను అధికారులు బహిర్గతం చేయాల్సి ఉంది.
గిరిజనుల పేరుతో సొసైటీ ఏర్పాటు చేసి, అసలు వ్యాపార ప్రయోజనాలు మరెవరికైనా చేరుతున్నాయా? సొసైటీ సభ్యులే ఇసుక పూడికతీత, రవాణా, విక్రయ వ్యవహారాల్లో భాగస్వాములుగా ఉన్నారా? లేక కేవలం కూలీ పనులకే పరిమితమవుతున్నారా? అన్నది విచారణతో తేలాల్సిన విషయం.
పంచాయతీ తీర్మానం ఉందా? అనుమతుల సంగతేంటి?
TGMDC ప్రాజెక్ట్ అధికారి 26-05-2026న గ్రామపంచాయతీ కార్యదర్శికి పంపిన లేఖలో తీర్మానం పంపించాలని కోరడం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ తీర్మానం నిజంగా జరిగిందా? జరిగితే ఏ తేదీన జరిగింది? తీర్మానంలో ఎలాంటి షరతులు విధించారు? అనంతరం TGMౄCకి తుది అనుమతులు జారీ అయ్యాయా? సొసైటీకి అధికారికంగా పని అప్పగించారా? అనే వివరాలు ప్రజలకు తెలియాల్సి ఉంది.
అదేవిధంగా పూడికతీతకు సంబంధించిన మైనింగ్ అనుమతులు, పర్యావరణ అనుమతులు, రవాణా అనుమతులు, స్టాక్ యార్డుల అనుమతులు, పరిమాణాల కొలతలకు సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అధికారుల తనిఖీలు ఎక్కడ?
భారీ మొత్తంలో ఇసుక పూడికతీత ప్రతిపాదన ఉన్నప్పుడు సంబంధిత శాఖల పర్యవేక్షణ అత్యంత కీలకం. మైనింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, జిల్లా సహకార శాఖలు, TGMౄC అధికారులు సమన్వయంతో వ్యవహారాన్ని పర్యవేక్షించాలి. అనుమతించిన ప్రాంతంలోనేఈ పూడికతీత జరుగుతోందా? ఎంత ఇసుక తవ్వారు? ఎంత రవాణా చేశారు? ఎక్కడ నిల్వ చేశారు? సొసైటీకి ఎంత ఆదాయం వచ్చింది? గిరిజన సభ్యులకు ఎంత లాభం పంపిణీ చేశారు? అనే వివరాలను ప్రజల ముందుంచాలి.
విచారణ జరిపితేనే అసలు నిజాలు వెలుగులోకి!
సింగిరెడ్డిపల్లి పూడికతీత ప్రతిపాదన, భూపతిరావుపేటలో ఇసుక నిల్వలపై వస్తున్న ఆరోపణలు, జానంపేట మార్గంలో రవాణాపై వ్యక్తమవుతున్న అనుమానాలన్నింటిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పూడికతీత అనుమతులు, గ్రామపంచాయతీ తీర్మానాలు, సొసైటీ ఒప్పందాలు, ఇసుక రవాణా పర్మిట్లు, స్టాక్ రిజిస్టర్లు, లాభాల పంపిణీ వివరాలను సమగ్రంగా పరిశీలిస్తేనే ఈ వ్యవహారంలో వాస్తవాలు బయటపడతాయి. గిరిజనుల అభివృద్ధి పేరుతో చేపడుతున్న ఇసుక పూడికతీతలో నిజమైన లబ్ధిదారులు గిరిజనులేనా? లేక వారి పేర్లు తెరపై ఉండగా వ్యాపార ప్రయోజనాలు మరెవరికైనా చేరుతున్నాయా? అన్న ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.