ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

26-11-2026 | 10:12pm

రాజ్యాంగ హక్కులతో పాటు బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి: ప్రిన్సిపాల్ పవన్ కుమార్

టేకులపల్లి, (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) టేకులపల్లిలో కళాశాల ఎన్‌ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఎం. పవన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని, 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని (సంవిధాన్ దివస్) జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌర బాధ్యతలను కూడా విద్యార్థులు తెలుసుకొని ఆచరించాలని సూచించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశిక పఠనం, రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బానోత్ బాబురావు, స్టూడెంట్ కౌన్సిలర్ ముంతాజ్ అలీ, అధ్యాపకులు బసవమ్మ, శంకర్రావు, వేణుగోపాల్, శ్రీనివాసరావు, యాకూబ్, వరలక్ష్మి, ప్రమోద్ కుమార్, సంజీవరెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది బిక్షం, అశోక్ యాదవ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు