డిజిటల్ మోసాలపై ఉక్కుపాదం
20 రాష్ట్రాలు 89 చోట్ల సీబీఐ సోదాలు
42 కోట్ల మోసం కేసుల్లో ముగ్గురు అరెస్ట్
ఖమ్మంలో టీజీసీఎస్బీ దాడులు, ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: డిజిటల్ సైబర్ మోసాల(Digital Cyber Frauds)పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ మోసాలపై నమోదైన కేసులకు సంబంధించిన సీబీఐ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 89 చోట్ల చేపట్టిన ఆపరేషన్‌లలో ముగ్గురిని అరెస్టు చేసింది. వారి నుంచి మ్యూల్ బ్యాంకు ఖాతాల వివరాలు, డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ శుక్రవారం ప్రకటించింది. పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, కస్టమ్స్ అధికారులు ఇలా ప్రభుత్వాధికారుల పేర్లు చెబుతూ ఈ మోసాలకు తెగబడుతున్నారని సీబీఐ వివరించింది.
ఈ తరహా నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఇటీవలే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి సుమారు రూ. 42 కోట్లు వసూలు చేశారని తెలిపింది. బిట్స్ పిలానీ కేసులో రూ. 7.67 కోట్లు, గుజరాత్ కేసులో రూ. 19.24 కోట్లు, కర్ణాటక కేసులో రూ. 14.45 కోట్లు మోసం చేశారని తెలిపింది. అరెస్టు అయిన వారిలో హరియాణాకు చెందిన ఆకాశ్, కోల్‌కతాకు చెందిన రాజ్‌కర్మాకర్, జ్యోతిరాణి అనే వారున్నారని సీబీఐ వివరించింది.
ఖమ్మంలోనూ దాడులు..
మరోవైపు ఇటువంటి మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో మోసాలకు సహకరిస్తున్న ఖమ్మం వాసులు మురళీకృష్ణ, సాయి అనే వ్యక్తుల నివాసాల్లో సోదాలు చేపట్టి 10 మ్యూల్ ఖాతాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి చైనా ఆపరేటర్లతో సంబంధాలున్నాయని, ఆన్‌లైన్ గేమింగ్ చెల్లింపులకు మ్యూల్ ఖాతాలను వినియోగించారని గుర్తించారు.
ఇటువంటి కేసుల్లో ఇప్పటివరకు 52 మందిని అరెస్టు చేశామని, 121 మ్యూల్ ఖాతాలను గుర్తించామని, మరో అనుమానిత 273 ఖాతాలపై నిఘా పెట్టామని తెలిపారు. 25 అనుమానిత బ్యాంక్ అకౌంట్‌ల ద్వారా రూ. 7.84 కోట్ల లావాదేవీలను గుర్తించామని తెలిపింది. కమీషన్లు ఆశించి ఎవ్వరికీ బ్యాంకు ఖాతాలు వాడుకునేందుకు ఇవ్వొద్దని ఈ సందర్భంగా టీజీసీఎస్బీ ప్రజలను హెచ్చరించింది.






