5 September, 2026 | 6:53 AM

ఏపీ తిరకాసు

05-09-2026 | 05:40am

కృష్ణా జలాల వాటాలపై కుదరని ఏకాభిప్రాయం

ఎల్ నినో ప్రభావంతో 50:50 కోరిన తెలంగాణ

66:34 వాటా కోసం పట్టుబట్టిన ఆంధ్రప్రదేశ్

పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుపై అభ్యంతరం

‘సాగర్’లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఏపీ డిమాండ్

ఇరు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ కమిటీ పలు సూచనలు

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ-ఆంధ్రప్రదేశ్(Telangana-Andhra Pradesh) మధ్య కృష్ణా జలాల(Krishna water) వివాదం ఏళ్లు గడుస్తున్నా కొనసాగుతూనే ఉంది. నీటి వాటాల పంపకంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరకాసు పెడుతూనే ఉంది. తాజాగా శుక్రవారం జరిగిన భేటీలో కూడా ఆ రాష్ట్ర ప్రతినిధుల(state representatives) మొండిపట్టుతో సమస్య కొలిక్కిరాకుండా పోయింది.

శుక్రవారం హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ(KRMB three-member committe) భేటీ వాడీవేడిగా సాగింది. తాగునీటి వాటాల(drinking water shares) కేటాయింపుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. చివరకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం అర్ధంతరంగా ముగి సింది. సెప్టెంబర్ నాలుగో వారంలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. 

కొలిక్కిరాని నీటి పంపకాలు!

తెలుగు రాష్ట్రాల మధ్య తాగునీటి వాటాల కేటాయింపుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశంలో శుక్రవారం తీవ్రస్థాయిలో వాదనలు జరిగా యి. తాగునీటి అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వాటాల నిష్పత్తి, నీటి వినియోగం తదితర అంశాలపై ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. అయితే  ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం అసంతృప్తిగా ముగిసింది.

ఈ సందర్భంగా తెలంగాణ ఈఎన్సీ రమేష్‌బాబు స్పందిస్తూ ప్రస్తుతం కేఆర్‌ఎంబీ పరిధిలోని ఉమ్మడి జలాశయాల్లో సుమారు 142 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు. తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ కోరినట్లు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున సమాన వాటా అవసరమని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

అయితే ఏపీ మాత్రం గతంలో అనుసరించిన తాత్కాలిక పంపకాల విధానాన్ని కొనసాగిస్తూ 66:34 నిష్పత్తిలోనే నీటిని కేటాయించాలని డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. 66:34 నిష్పత్తి ప్రకారం ఏపీకి తాగునీటి కోసం 97 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి కోరినట్లు తెలిపారు. మరోవైపు తమ రాష్ట్రానికి తాగునీటి అవసరాల కోసం 104 టీఎంసీలు కావాలని ఏపీ వాదించింది.

పోతిరెడ్డిపాడుపై అభ్యంతరం..

తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు 200 టీఎంసీలు, ఏపీకి 100 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరినట్లు ఈఎన్సీ రమేష్‌బాబు తెలిపారు. అయితే ఏపీ అధికారులు దీనికి భిన్నంగా తమకు 66:34 నిష్పత్తి ప్రకారం నీటి వాటా కావాలని పట్టుబట్టారు. దీంతో నీటి పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య స్పష్టమైన భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సమావేశంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి తరలింపు అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తోందని రమేష్‌బాబు ఆరోపించారు. ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితుల్లో ఒక రాష్ట్రం అధికంగా నీటిని తీసుకెళ్లడం వల్ల తెలంగాణ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ఆరోపణలను ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తోసిపుచ్చారు. పోతిరెడ్డిపాడు, ఇతర ప్రాజెక్టుల నుంచి తమకు కేటాయించిన వాటా మేరకే నీటిని వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. మరోవైపు నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడంపైనా ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి కోరారు.

తాగునీటి అవసరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, అందుబాటులో ఉన్న నీటిని ముందుగా తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉందని ఏపీ వాదించింది. అయితే తెలంగాణ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి అవసరాల కోసం సమాన వాటా కేటాయింపే సరైన మార్గమని స్పష్టం చేసింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేపట్టాలని పట్టుబట్టింది.

నీరు పొదుపుగా వాడుకోవాలి..

నదీ జలాల వాటా పంపకాలపై సయోధ్య కుదరకపోవడంతో కేఆర్‌ఎంబీ రెండు తెలుగు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కేవలం కరెంట్ ఉత్పత్తి కోసం ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయొద్దని పేర్కొంది. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను నియంత్రించాలని చెప్పింది. ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువ ఉన్నాయని, అందుకు అనుగుణంగా పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాలకు హితవుపలికింది. కష్టకాలంలో తాగునీటికి ప్రాధానమివ్వాలని విభజన చట్టంలోని అంశాన్ని ఉటంకించింది. 

మరోసారి భేటీకి నిర్ణయం..

ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు తమ తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. తాగునీటి వాటాల విషయంలో తెలంగాణ 50:50 నిష్పత్తిని కోరుతుండగా, ఏపీ 66:34 నిష్పత్తినే కొనసాగించాలని పట్టుబడుతోంది. దీంతో కృష్ణా జలాల పంపకాలపై మరోసారి ప్రతిష్టంభన నెలకొంది.

నీటి లభ్యత, తాగునీటి అవసరాలు, ప్రాజెక్టుల వినియోగం, విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై మరింత చర్చించేందుకు సెప్టెంబర్ నాలుగో వారంలో మరోసారి సమావేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అప్పటివరకు ఇరు రాష్ట్రాలు తమ వాదనలకు సంబంధించిన అంశాలను మరింత స్పష్టంగా బోర్డు ముందుంచే అవకాశం ఉంది. మొత్తంగా తాగునీటి వాటాలపై రాజీ కుదరకపోవడంతో కృష్ణా జలాల పంపకాల వ్యవహారం మరోసారి ఉత్కంఠగా మారింది.

మరిన్ని వార్తలు