ఎన్విడియా ఎఫెక్ట్.. ఆసియా మార్కెట్లలో భారీ ర్యాలీ

24-11-2026 | 10:59am

ప్రపంచ స్టాక్ మార్కెట్లలో(World stock markets) మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్(Nvidia CEO Jensen Huang) తిరిగి బాధ్యతలు చేపట్టడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంపై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగింది. దీంతో మంగళవారం ఆసియా మార్కెట్లు(Asian Stock Markets) భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ముఖ్యంగా చిప్ తయారీ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది.

దక్షిణ కొరియా కోస్పి సూచీ 7.5 శాతం, తైవాన్ మార్కెట్ 9.1 శాతం వరకు ఎగబాకగా.. జపాన్ నిక్కీ 225 సూచీ సుమారు 4.5 శాతం లాభపడింది. జపాన్ వెలుపల ఆసియా-పసిఫిక్ షేర్ల MSCI సూచీ 4.6 శాతం పెరిగి ఎనిమిది నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుంది. హాంకాంగ్, చైనా మార్కెట్లలోనూ లాభాల ట్రెండ్ కొనసాగింది.

చిప్ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్

ఆసియా మార్కెట్ల ర్యాలీలో సెమీకండక్టర్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) షేర్లు 8 శాతానికి పైగా పుంజుకున్నాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి అవసరమైన చిప్స్, డేటా సెంటర్లపై పెట్టుబడులు కొనసాగుతాయనే అంచనాలు ఈ కొనుగోళ్లకు ఊతమిచ్చాయి.

ఒక్కరోజులో 31.5 శాతం పెరిగిన ఎన్విడియా

మరోవైపు అమెరికా మార్కెట్లలోనూ టెక్నాలజీ షేర్లు భారీగా లాభపడ్డాయి. సోమవారం ఎన్విడియా షేర్లు ఏకంగా 31.5 శాతం పెరిగాయి. 23 ఏళ్లలో నమోదైన అతిపెద్ద రోజువారీ శాతం లాభాల్లో ఇదొకటిగా నిలిచింది. కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల మేర తిరిగి పుంజుకుంది. అమెరికాలో నాస్‌డాక్ కాంపోజిట్ 6.5 శాతం, నాస్‌డాక్ 100 సూచీ 6.9 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 4.7 శాతం లాభపడ్డాయి.

గత వారం ఏఐ రంగంలో పెట్టుబడులపై అనిశ్చితి, టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు కుదేలయ్యాయి. తాజాగా జెన్సన్ హువాంగ్ తిరిగి ఎన్విడియా పగ్గాలు చేపట్టడంతో ఆందోళనలు కొంత తగ్గి మార్కెట్లలో కొనుగోళ్ల సందడి నెలకొంది. అయితే ఏఐ రంగంలో భారీ పెట్టుబడులకు తగిన రాబడులు వస్తాయా? అనే ప్రశ్నలు మాత్రం ఇన్వెస్టర్లను ఇంకా వెంటాడుతున్నాయి.

మరిన్ని వార్తలు