సిద్ధారం పాఠశాలలో ప్రీ ప్రైమరీ సామగ్రి ప్రారంభం

24-11-2026 | 10:53am

సత్తుపల్లి, నవంబర్ 24 (విజయక్రాంతి): చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య (Play-based Learning) అందించి వారిలో చదువుపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యమని సత్తుపల్లి మండల విద్యాధికారి రాజేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రభుత్వం అందించిన ప్రీ ప్రైమరీ విద్యా సామగ్రిని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసు నుంచే ఆటల ద్వారా విద్యాబోధన (Education) చేపట్టడం వల్ల పిల్లల్లో నేర్చుకోవాలనే ఆసక్తి, సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరుగుతాయని తెలిపారు. ప్రీ ప్రైమరీ దశలో ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించడం ద్వారా భవిష్యత్తు చదువులకు బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందించిన జారుడు బల్లలు, ఊయలలు, చిన్న టేబుళ్లు, కుర్చీలు, ఆటబొమ్మలు, పుస్తకాల ర్యాక్ తదితర సామగ్రి చిన్నారుల అభ్యసనానికి (Learning) ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కొత్త సామగ్రిని చూసిన చిన్నారులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఆర్. శైలకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. సురేష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు