రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
28-09-2026 | 12:17pm
బెజ్జంకి, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన తిప్పారపు సురేష్(Thipparapu Suresh) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు.స్థానికుల వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి బెజ్జంకి క్రాసింగ్ సమీపంలోని శంకర్‌నగర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సురేష్ తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే ఆయనను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాదానికి దారితీసిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ వివరాలను తెలుసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.