విజయ సాధనకు అవసరమైన అంశాలు

11-11-2026 | 05:05am

విజిగీషురాత్మనః పరస్య చ బలాబలం 

శక్తిదేశకాలయాత్రాకాల బలసముత్థానకాల పశ్చాత్కోపక్షయవ్యయలాభాపదాం జ్ఞాత్వా విశిష్టబలోయాయాయ్, అన్యథా ఆసీత...

విజయాన్ని బలంగా కోరుకునేవాడు, తనకూ, శత్రువుకూ సంబంధించిన శక్తి సామర్థ్యాలను(capabilities and potential), దేశకాల పరిస్థితులను, యుద్ధయాత్రా సమయం(Time for the Military Expedition), సైన్యం యుద్ధ సన్నద్ధమయే కాలం, అంతర్గత తిరుగుబాటులు మొదలయినవే కాక క్షయం, వ్యయం, లాభం, ఆపదలు, వీటిని నిష్పాక్షికంగా పరిశీలించి, క్షుణ్ణంగా విశ్లేషించుకొని, తన బలం అధికంగా ఉన్నట్లయితే యుద్ధానికి వెళ్ళాలి. అలా కాకపోతే  తొందరపడకుండా, మెదలకుండా కూర్చోవాలి, అంటున్నాడు ఆచార్య చాణక్య.

చేయబోయే పని లక్షణాలే అది సిద్ధిస్తుందో సిద్ధించదో సూచిస్తుంది. అనగా ఒక కార్యం ప్రారంభించడానికి ముందే, దాని స్వభావం, అనుకూలతలు, ప్రతికూలతలు, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే, దాని ఫలితాన్ని కొంతవరకు ముందుగానే అంచనా వేయవచ్చు. విజయాన్ని సాధించాలి అనుకునే వారు తదనుగుణమైన కార్యాలను నిర్వహించాలి.

పువ్వులు కావాలనుకునే వారు ఎండిపోయిన చెట్టుకు నీరుపోయరు కదా, అంటాడు చాణక్య. మనం ఆశించే ఫలితాన్ని ఇచ్చే సామర్థ్యం లేని వ్యక్తి, వ్యవస్థ లేదా పరిస్థితిపై మన సమయాన్ని, శ్రమను, వనరులను వెచ్చించడం వివేకవంతమైన చర్య కాదు. చాలామంది మనుషులు ఆశలకు బంధీలౌతారే కాని ఆశయాలను కోరుకోరు.

ఆశలు మాత్రమే సంపదను సృష్టించవు. ఆశయ సాధన వల్లనే సంపద లభ్యమౌతుంది. ఆశయం సహజీవనాన్ని కోరుకుంటుంది. ఆశ ‘స్వార్థాని’కి తెరలేపుతుంది. స్వార్థం ‘నేనే‘ అనే భావనను జాగృతం చేస్తుంది. ఆ అహంభావన ఇతరులను ‘ఆక్రమించేందుకు‘ ప్రేరణనిస్తుంది. అవే మానవుల మధ్య అంతరాలను సృష్టించి, యుద్ధాలకు అంకురార్పణ చేస్తాయి. 

అయితే యుద్ధం వల్ల లాభం రావచ్చు.. అలాగే నష్టాన్నీ కలిగిస్తుందని గుర్తించాలి. శిక్షణ పొందిన మానవ వనరులు, ఆర్థిక వనరులు వ్యయం కావచ్చు. అనుకోని ఆపదలు ఎదురవవచ్చు. కాబట్టి నిర్ణయానికి వచ్చే ముందే నిశితంగా అన్ని అంశాలను ఆయా రంగాలలో నిష్ణాతులైన సలహాదారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 

ప్రత్యర్థిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎదుర్కోవచ్చు. అలాగే ఒక సంస్థ ప్రత్యక్ష పోటీని ఎదుర్కోవచ్చు. లేదా ప్రత్యక్ష ఘర్షణకు వెళ్లకుండా, తన ప్రత్యేకతలు, నాణ్యత, వినూతన ఆవిష్కరణలు, సమర్థవంతమైన నిర్వహణ ద్వారా పోటీలో ముందంజ వేయవచ్చు.

సంగీతంలోని సప్తస్వరాలతో ఎలాగైతే లెక్కలేనన్ని రాగాలను సృష్టిస్తామో అలాగే ఈ ప్రత్యక్షపరోక్షాల సమన్వయంతో లెక్కలేనన్ని వ్యూహాలు రచించుకునే అవకాశం ఉన్నది. అయితే ఈ రెంటిలో పరోక్షపద్ధతులే విజయాన్ని అందించే అవకాశాలు ఎక్కువ అంటాడు ‘సన్ ట్జు’ తన ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ అనే పుస్తకంలో.

రాజ్యాలు ఓడిపోవద్దని చేసే యుద్ధం కన్నా గెలవాలనే సంకల్పంతో చేసే యుద్ధం విజయానికి మార్గం చూపుతుంది. అలాగే సంస్థలు పరాజయాన్ని నివారించాలనే ఆలోచనతో మాత్రమే పనిచేయడం కన్నా, నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పంతో పనిచేయడం విజయానికి మార్గం చూపుతుంది.

ముందస్తు ప్రణాళికలు, సమర్థవంతంగా వనరుల వినియోగం, వ్యయ నియంత్రణ, వ్యూహాత్మక ఆలోచనలు, స్థితిగతులను సరిగా అంచనా వేయడం, సమన్వయంతో సమష్టిగా శక్తిసామర్థ్యాలను వినియోగించడం, తన పర బలాలు, బలహీనతలపై అవగాహన, అన్ని విభాగాలను సమన్వయం చేయడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలలో మార్పు, పరిస్థితులను నిరంతరం అవగాహనతో పరిశీలించడం, పరిసరాల ప్రభావాన్ని అంచనా వేయడం, విభిన్న పరిస్థితులలో అనువైన సత్వర నిర్ణయాలు తీసుకోవడం,

సమాచార సేకరణ, విశ్లేషణ ప్రధానంగా విజయద్వారాన్ని తెరుస్తాయి. అయితే చాణక్య ఆనాటి కాలంలో యుద్ధాలను జయించాలని సూచించిన ఈ అంశాలు కేవలం యుద్ధ తంత్రాలుగా చూడడం కన్నా, ఈనాటి అవసరాలకు అనుగుణంగా సంస్థల నిర్వహణ, అందులో ఎదురయ్యే సమస్యలను అంచనా వేయడం, నిర్ణయాలు తీసుకోవడం, వనరులను నిర్వహించడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం అనే కోణాలలో అధ్యయనం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది.

వ్యాపారంలో ఏ ఉత్పత్తియైనా పోటీని ఎదుర్కొంటుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్ లో తన భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు ఒక సంస్థ యత్నించవచ్చు. ఆ సంస్థను అధిగమించేందుకు యత్నించే ఆరోగ్యకరమైన స్పర్థకన్నా ఆ సంస్థను పడద్రోసేందుకు పలు సంస్థలు ప్రయత్నించడం కూడా కనిపిస్తున్నది.

ఈ పరిస్థితులు దాదాపుగా రెండు దేశాల మధ్య యుద్ధంలాంటి పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. అందులో విజయం సాధించాలంటే.. తన సంస్థ బలాలు ఏమిటి? తన పరిమితులు ఏమిటి? తాను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటి? ఇతర సంస్థల సామర్థ్యాలు ఏమిటి? తన సాంకేతిక పరిజ్ఞానం, పరిసరాల అవగాహనపై స్పష్టత కలిగిన నాయకుడు మెరుగైన నిర్ణయాలు తీసుకోగలడు.

పోరాటం చేయకుండానే ప్రత్యర్థిని అధిగమించగలగడం అత్యున్నత వ్యూహాత్మక నైపుణ్యం అంటాడు సన్ ట్జు. అంటే ప్రతి సమస్యకూ ఘర్షణ పరిష్కారం కాదు. సరైన ప్రణాళిక, చర్చ, సమన్వయం, పరస్పర అవగాహన ద్వారా సమస్యను పరిష్కరించగలిగితే, అది విజయానికి మరింత సమర్థవంతమైన మార్గంగా భావించాలి.

దీనిని సంక్షోభాల నియంత్రణగా చెప్పుకోవచ్చు. నిజానికి విజయం అనేది కేవలం చివరి ప్రయత్నంలో సాధించేది కాదు. దానికి ముందుగా చేసిన అధ్యయనం, రచించుకున్న ప్రణాళికలు, మానసిక సన్నద్ధత, కార్యరూప సంసిద్ధతలు కీలకంగా భావించాలి. 

సంస్థను స్థాపించాలి అంటే అప్పటికే ఆ రంగంలో నిలదొక్కుకున్న సంస్థలతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదురయ్యే అవరోధాలను గుర్తించాలి. తమ లక్ష్యాలు ఏమిటో నిర్దిష్టంగా, నిర్దుష్టంగా నిర్ధారించుకోవాలి. అందుబాటులో ఉన్న వనరులను అంచనా వేయాలి. ఎదురయ్యే సాంకేతిక సమస్యలను గుర్తించాలి. ప్రతి సమస్యకూ ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.

దీనినే వ్యూహాత్మక ప్రణాళికలుగా భావించవచ్చు. ‘నేను మారను, ఇలాగే ఉంటాను‘ అనే ఒకే విధమైన మూసబోసిన ఆలోచనా సరళి అన్ని సందర్భాలలోనూ ఫలితాలను ఇవ్వదు. పరిస్థితులకు అనుగుణంగా మారడం విజయానికి ప్రథమ సోపానం. సమర్థుడైన నాయకుడు పరిస్థితులను పరిశీలించి, అవసరమైనప్పుడు తన నిర్ణయాలను మార్చుకుంటాడు. 

కాలమేదైనా, రంగమేదైనా పరిస్థితులను ముందస్తుగా అంచనావేయడం, సమాచార సేకరణ, దాని విశ్వసనీయత మరియు చెల్లుబాటును నిర్ధారించుకోవడం, సమాచార విశ్లేషణ, వనరుల సమీకరణ, సమర్థవంతమైన వినియోగం, నాయకుని నిర్ణయ సామర్థ్యం వంటి పలు అంశాలు విజయసాధనలో ప్రధాన పాత్రను పోషిస్తాయి.

ఈ సందర్భంలో చాణక్య సూచనలు...యుద్ధానికి ముందు అంచనా వివరాలను ఈనాటి కాలంలో ప్రాజెక్టుకు ముందు అధ్యయనంగానూ, సైనికుల సమన్వయాన్ని ఉద్యోగుల సమష్టి కృషిగానూ, ప్రత్యర్థి బలహీనతల అవగాహనను పోటీ సంస్థల పరిస్థితుల విశ్లేషణగానూ, యుద్ధ వ్యయ నియంత్రణను సంస్థాగత వనరుల సమర్థ వినియోగం మరియు అనవసర వ్యయ నియంత్రణగానూ, పరిస్థితులకు అనుగుణంగా మార్పును నాయకత్వంలోని అనుకూలతగానూ భావించుకుంటే...

విజయసాధనలోని అననుకూలతలను అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలుస్తాయి. ఇక్కడ గుర్తించాల్సింది.. సమస్యను ఎదుర్కోవడం కంటే, సమస్య స్వరూపాన్ని ముందుగా అర్థం చేసుకోవడం గొప్ప నైపుణ్యం. చాణక్యుని రాజ్యపాలనలోని ఈ భావన సంస్థ నిర్వహణలోనూ ఉపయుక్తమౌతున్న విధానం స్ఫురిస్తున్నది.

మరిన్ని వార్తలు