విలీనం సరే.. విజన్ ముఖ్యం
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇంటర్మీడియట్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన కొత్త దేమీ కాదు. గత ఏడాదే ప్రకటించి, ఆ తరువాత వాయిదా వేసిన అంశమే. అప్పట్లో విలీనంపై సంసిద్ధత లేకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ అం శంపై ఏడాదిగా కసరత్తు జరుగుతోంది.
ఇప్పటికే సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు పరీక్ష విధానాన్ని సవరించారు. తాజా ప్రకటనతో విలీన ప్రక్రియకు కొంత వరకు సానుకూల వాతావరణం ఏర్పడింది. పాఠశాల విద్యలో ఇంటర్‌బోర్డు విలీన ప్రక్రియ కొత్తదేమీ కాదు. పన్నెండు సంవత్సరాల క్రితం అంటే పదో తరగతి పరీక్షలు విద్యాహక్కు చట్టం సూచించిన సీసీఈ విధానంలో జరిగే నాటికే ముందుకు రావాల్సిన అం శం. అయితే, కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం ప్రకారమైనా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాల్సి ఉంది. కానీ, పాలకులు ఎవరూ ఆసాహసం చేయలేదు.
సంప్రదాయక విధానంలో ఇంటర్ విద్యను కొనసాగిస్తూ వచ్చారు. కాకుంటే నూతనంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేజీబీవీ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక, ఏకలవ్య స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావం తర్వాత సామాజిక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో మాత్రం పాఠశాల విద్యతో ఇంటర్ విద్యను చట్టప్రకారం అనుసంధానం చేస్తూ వచ్చారు. అప్పటివరకు కొనసాగుతున్న పాత పాఠశాలలు, జూనియర్ కళా శాలల జోలికి వెళ్లలేదు. అందుకు కారణాలు ఎన్నయినా ఉండవచ్చు. విలీన ప్రక టన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఒక విషయం ప్రస్తావించారు.
ప్రైవేటు విద్యావ్యవస్థకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇంటర్మీడియట్ బోర్డు విలీనం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ఆయన మాటలను బట్టి పుష్కర కాలంగా జరగాల్సిన ప్రక్రియ ముందుకు సాగకపోవడం ప్రైవేటు విద్యావ్యవస్థ పుణ్యమేనని అర్థం అవుతుంది. విలీనంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన హర్షించదగ్గ అంశమే. అ యితే, మాటలతో సరిపెట్టుకుండా వ్యవస్థ, సంస్థాగతంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది.
మూడంచెల విద్యా వ్యవస్థ
వ్యవస్థాగతంగా చూసినప్పుడు పాఠశాల విద్యను మూడు భాగాలుగా విభజిం చి మూడు పాలనా వ్యవస్థలు ఏర్పరచాల్సి ఉంది. అంటే తెలంగాణా ఫౌండేషన్ స్కూ ల్స్ (అంగన్వాడీ కేంద్రాలు) నుంచి నాలు గో తరగతి వరకు ప్రాథమిక, 5 నుంచి 8వ తరగతి వరకు మాధ్యమిక, 9నుంచి 12వతరగతి వరకు ఉన్నత పాఠశాల వ్యవస్థగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవస్థాగత సర్దుబాటులో ప్రాథమిక పాఠశాల నుంచి 5వ తరగతిని మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోని 6,7,8 తరగతులు కలిపి మాధ్యమిక పాఠశాల వ్యవస్థగా రూపుదిద్దుకోవాలి.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18వేల ప్రాథమిక పాఠశాల ల్లో 4,100 ప్రాథమికోన్నత పాఠశాలలను తరగతుల మార్పుల ద్వారా అవ సరానికి అనుగుణంగా సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న 9, 10 తరగతులకు అదనంగా 11, 12 తరగతులను జోడించాల్సి ఉంటుంది. ఇందు కోసం 5,100 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులను, 426 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 9, 10 తరగతుల ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సరిపడా విద్యార్థుల నమోదు లేని జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల విషయంలోనూ నిర్దిష్టమైన నిర్ణయం విద్యాశాఖ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంతేకాదు.. ఇంటర్ తరగతులకు అవసరమైన బోధనా సిబ్బంది సర్దుబాటు లేదా ఏర్పా టు అత్యవసరం.
ఇందుకోసం వ్యవస్థాగతమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. 2027 జూన్ నుంచి మార్పు అమలు జరిగినా, ముందస్తుగానే ఆ దిశగా కసరత్తు జరగాలి. ఆచరణలో తలెత్తే అడ్డంకులను అధిగమిస్తూ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక సంస్థాగత మార్పులు విషయానికి వచ్చినట్లయితే ఇం టర్మీడియట్ బోర్డు, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఈ రెండు కొనసాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 9నుంచి 12వ తరగతి వరకు సుమారు 20లక్షల మంది విద్యార్థులకు రెండు బోర్డుల అవసరం ఎంతమా త్రం లేదు. ప్రస్తుతం ఉద్యో గ నియామకాలకు ఇంటర్ అర్హతనే కనీస ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. టెన్త్ సర్టిఫికెట్ కేవలం పుట్టిన తేదీ ధ్రువీకరణకు ప్రాతిపదికగా వాడుతున్నారు.
ఇక ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యాబోర్డులు ఏర్పాటు ద్వారా పాఠశాల విద్యా పరిపాలనా ప్రక్రియ సులభమవుతుంది. సంస్థాగత, వ్యవస్థాగత మార్పులు లేకుండా జరిపే విలీనం మరిన్ని సమస్యలకు హేతువవుతుంది. తాజా 2025- యుడైస్ గణాం కాలు కూడా ప్రైవేటు పాఠశాల వ్యవస్థ పెరుగుదలనే సూచిస్తున్నాయి. వివిధ కారణాలతో ప్రభుత్వ పాఠశాల సంఖ్య ఏడాది లోనే 1,969 వరకు తగ్గి, 28,088 పాఠశా లలు ఉనికిలో ఉన్నాయి. అదే ప్రైవేటు పాఠశాలల సంఖ్య గతంలో ఉన్నవాటికి అదనంగా 771 పెరిగి 13,125 వద్ద స్థిరపడ్డాయి.
ఇక ప్రైవేటు స్కూళ్లలో 49.5లక్షల విద్యార్థులు (64.5శాతం) ఉంటే, ప్రభు త్వం పాఠశాలల్లో 26.5లక్షల మంది (34.5శాతం) మాత్రమే ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లన్నీ ఇంటర్‌తో సమీకృతంగా ఉంటే, సర్కారు పాఠశాలల్లో ఆ అవకాశం లేకుండాపోయింది. గత పాలకులు చట్టాలను చాపలా చుట్టి ప్రైవేటు విద్యావ్యవస్థ చంకలో పెట్టారనేది రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల్లో అం తరార్థం కావచ్చు. అందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే చట్టసభల నిండా ప్రైవేటు విద్యా వ్యాపారులు తిష్టవేయడమే అందుకు ప్రబల తార్కాణం.
ఇంటర్లో నైపుణ్య విద్య తప్పనిసరి
ఇకపోతే ప్రభుత్వ జూనియర్ కళాశాల లు 426 ఉండగా, ప్రైవేటు 1,292 ఉన్నాయి. సౌకర్యాలు అంతగా లేకపోయినా, అర్హులైన బోధకులు లేకపోయినా ప్రైవేటు కళాశాలలనే ఆదరిస్తున్నారు. అంటే ప్రభుత్వ కళాశాలల్లో జవాబుదారీతనం లోపించడం, ప్రైవేటులో జీ, టోఫెల్ లాంటి శిక్షణ ఇంటర్ దశ నుంచే అందుబాటులో ఉండటం కూడా కారణంగా చెప్పవచ్చు. తెలంగాణ విద్యా కమిషన్ కూడా ఈ విష యాన్ని స్పష్టం చేసింది. ప్రభుత్వ కళాశాలల్లోనూ ఆ తరహా సౌకర్యాలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. ఏదే మైనా ఇం టర్బోర్డు విలీనం మాత్రమే కాదు, స్పష్టమైన విజన్‌కు అవకాశం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
వ్యాసకర్త: సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు, సెల్ నం: 9441864514
ఎన్ తిర్మల్