హక్కుల చిరునామా రాజ్యాంగం
తీగల అశోక్ కుమార్ :
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం(Constitution) కలిగిన ప్రజాస్వామ్య దేశం భారత్(India is a democratic country.). 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్(Constituent Assembly of India) రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Dr. Babasaheb Ambedkar) కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేసిన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి(Constitutional Drafting Committee) ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు జరిగిన చర్చలు, పరిశీలనలు, సంప్రదింపుల అనంతరం రాజ్యాంగం తుదిరూపు దాల్చింది.
రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సామాజిక న్యాయం వంటి విలువలు భారత ప్రజాస్వామ్యానికి పునాదులుగా నిలిచాయి. ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు. భారత రాజ్యాంగం పౌరులకు అనేక ప్రాథమిక హక్కులను(fundamental rights) కల్పించింది. చట్టం ముందు అందరూ సమానులేనని ఆర్టికల్ 14 స్పష్టం చేస్తుంది. కులం, మతం, జాతి, లింగం ఆధారంగా వివక్షను ఆర్టికల్ 15 నిషేధిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలను ఆర్టికల్ 16 కల్పిస్తుంది. అంటరానితనాన్ని ఆర్టికల్ 17 రద్దు చేసింది. ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది. ఈ నిబంధనలు సామాజిక సమానత్వం,
మానవ గౌరవం దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. సామాజిక న్యాయానికి రాజ్యాంగమే ఆధారం. సమాజంలోని అణగారిన, వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగం ప్రత్యేక నిబంధనలను అందించింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగం మార్గం చూపింది. మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల అభివృద్ధికి కూడా పలు రక్షణలు కల్పించింది. రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేకత 2015 నుంచి నవంబర్ 26ను అధికారికంగా రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో రాజ్యాంగ పీఠిక పఠనం, వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు, చర్చాగోష్టులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో రాజ్యాంగంపై అవగాహన పెంపొందిస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవడంతో పాటు అందులో పేర్కొన్న ప్రాథమిక విధులను కూడా ప్రతి పౌరుడు పాటించాల్సిన అవసరం ఉంది. కులవివక్ష, మతవివక్ష, అంటరానితనం,
సామాజిక అసమానతలకు తావులేకుండా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను
గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను భవిష్యత్ తరాలకు అందించాలి. భారత రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం కాదు.. ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచం, ప్రజాస్వామ్యానికి పునాది, సామాజిక న్యాయానికి మార్గదర్శి. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకుంటూ, రాజ్యాంగ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త సెల్ : 9666634001