మన విద్యావ్యవస్థ మారాలి
పరి‘జ్ఞానం’ పెంపొందించడంపై దృష్టి పెట్టాలి
సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందాలన్నా దాని వెనుక బలమైన శాస్త్రీయ పునాది ఉండాలి. కంప్యూటర్లు, సెమీకండక్టర్ చిప్‌లు, హార్డ్‌వేర్, శక్తి వనరులు, అధునాతన పదార్థాల తయారీ వంటి రంగాలన్నీ ప్రాథమిక శాస్త్ర పరిశోధనలపైనే ఆధారపడతాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, నానోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, అంతరిక్ష పరిశోధనల్లో ముందుకు వెళ్లాలంటే భౌతికశాస్త్రం,రసాయనశాస్త్రం, గణితం వంటి రంగాల్లో లోతైన పరిశోధనలు జరగాలి.
విదేశాల నుంచి కీలక సాంకేతిక పరికరాలను దిగుమతి చేసుకుంటూ, ఇక్కడ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నందుకు మాత్రమే స్వయం సమృద్ధి సాధించామని చెప్పలేం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు దాన్ని మనమే అభివృద్ధి చేసుకునే సామర్థ్యం పెంచుకోవాలి.
నేడు భారతదేశంలో విద్యారంగం(Education Sector) గురించి చర్చ జరిగినప్పుడల్లా కృత్రిమ మేధ, కోడింగ్, సాఫ్ట్వేర్, డిజిటల్ నైపుణ్యాలే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇవే భవిష్యత్తుకు బాటలు వేస్తాయని పాలకులు, విద్యావేత్తలు భావిస్తున్నారు. అయితే, ఈ చర్చల్లో ఒక కీలకమైన అంశం మరుగునపడుతున్నది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వేరు, కొత్త సాంకేతికతను సృష్టించే విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం వేరు. కేవలం కోడింగ్ నేర్పడం ద్వారా ఆవిష్కరణలు సాధ్యం కావు. వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను అర్థం చేసుకునే మేధస్సు అవసరం. రేపటి ప్రపంచానికి సాఫ్ట్వేర్ నిపుణులతో పాటు ప్రకృతి రహస్యాలను ఛేదించే శాస్త్రవేత్తలు, కొత్త ఆవిష్కరణలు చేసే పరిశోధకులు కూడా కావాలి. ఈ వాస్తవాన్ని మన విద్యావిధానం గుర్తించాలి.
ఎందుకనే ప్రశ్న ఎక్కడ?
మన విద్యావ్యవస్థలో ప్రాథమిక శాస్త్రాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. భౌతిక, రసాయన, గణిత, జీవశాస్త్రాలు ఆధునిక విజ్ఞానానికి పునాదులు. కానీ ప్రస్తుతం ఉద్యోగాలు, అధిక వేతనాలపై ఉన్న ఆకర్షణతో విద్యార్థులు ఇంజినీరింగ్, ఐటీ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పాఠశాలల్లోనూ ప్రశ్నించడం, పరిశీలించడం, ప్రయోగాలు చేయడం కంటే పరీక్షల్లో మార్కులు సాధించడానికే ప్రాధాన్యం పెరుగుతున్నది.
విద్యార్థుల్లో సహజంగా ఉండే ‘ఎందుకు?’ అనే ప్రశ్నకు సమాధానం వెతికే ఆసక్తిని పెంపొందించాల్సిన విద్యావ్యవస్థ, వారిని పాఠ్యపుస్తకాల్లోని విషయాలను గుర్తుపెట్టుకునేలా తయారుచేస్తోంది. ఫలితంగా స్వతంత్రంగా ఆలోచించే, కొత్త ఆలోచనలను ఆవిష్కరించే సామర్థ్యం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.
పెట్టుబడులు పెరగాలి..
ఈ విషయంలో పరిశోధనలకు మనం కేటాయిస్తున్న నిధులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం, 2023 భారతదేశ స్థూల పరిశోధన, అభివృద్ధి వ్యయం జీడీపీలో కేవలం 0.84 శాతంగా ఉంది. అదే ఏడాది ప్రైవేటు రంగం వాటా 51.8 శాతానికి చేరడం సానుకూల పరిణామమే అయినప్పటికీ, దేశ మొత్తం పరిశోధనా పెట్టుబడులు ఇంకా ఆశించిన స్థాయిలో లేవు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.
పరిశోధనలకు నిధులు పెంచడం, వాటిని సమర్థంగా వినియోగించడం రెండూ ప్రభుత్వాల బాధ్యత. నిధుల కొరతతో పాటు విశ్వవిద్యాలయాల్లోని అధికారిక జాప్యాలు, తగిన ప్రయోగశాలల లేమి, పరిశోధకులకు భరోసా కల్పించలేని పరిస్థితులు కూడా యువ మేధావులను నిరుత్సాహపరుస్తున్నాయి. ప్రతిభావంతులైన పరిశోధకులు మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడం దేశానికి నష్టమే.
ఈ పరిస్థితిని మార్చడానికి పాఠశాల విద్య నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పడంతో పాటు ప్రయోగాలు చేసే అవకాశం కల్పించాలి. ప్రతి పాఠశాలలో అందుబాటులో ఉండే ప్రయోగశాలలు, శాస్త్ర ప్రదర్శనలు, పరిశోధనాత్మక అభ్యాసం ఉండాలి. ప్రశ్నలు అడిగే విద్యార్థులను ప్రోత్సహించాలి.
ఉన్నత విద్యలో ప్రాథమిక శాస్త్రాలను అభ్యసించే వారికి తగిన ఉపకార వేతనాలు, పరిశోధనా ఫెలోషిప్‌లు అందించాలి. పరిశోధనను ఒక అనిశ్చితమైన వృత్తిగా కాకుండా గౌరవప్రదమైన, భవిష్యత్తు ఉన్న రంగంగా తీర్చిదిద్దాలి.
ప్రశ్నించేతత్వానికి ప్రాధాన్యమివ్వాలి
అదే సమయంలో పరిశోధన, అభివృద్ధి రంగానికి ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా పెరగాలి. విశ్వవిద్యాలయాలను కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలుగా కాకుండా, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. పరిశోధకులకు నిధులు సకాలంలో అందేలా చూడాలి. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని విస్తరించాలి.
ముఖ్యంగా సెమీకండక్టర్లు, మెటీరియల్ సైన్స్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పరిశ్రమలు విశ్వవిద్యాలయాల పరిశోధనలకు తోడ్పడాలి. పరిశోధనల్లో ఎదురయ్యే వైఫల్యాలను నిరుత్సాహానికి కారణంగా చూడకుండా, వాటిని కొత్త ఆవిష్కరణలకు దారితీసే అనుభవాలుగా పరిగణించాలి. కోడింగ్, కృత్రిమ మేధ, డిజిటల్ సాంకేతికతలకు ప్రాధాన్యం తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ వాటినే విద్యకు అంతిమ లక్ష్యంగా భావించడం పొరపాటు.
సైన్స్ పునాదులు బలంగా ఉన్నప్పుడే సాంకేతికతలో సృజనాత్మకత, స్వతంత్రత సాధ్యమవుతాయి. కేవలం ఇతరులు సృష్టించిన సాంకేతికతను ఉపయోగించే దేశంగా కాకుండా, ప్రపంచానికి కొత్త విజ్ఞానాన్ని, కొత్త సాంకేతిక పరిష్కారాలను అందించే దేశంగా భారత్ ఎదగాలి.
అందుకు మన తరగతి గదుల్లో కోడింగ్‌తోపాటు సైన్స్‌కు, నైపుణ్యాలతో పాటు పరిశోధనకు, మార్కులతో పాటు ప్రశ్నించే ఆలోచనకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. భారత్‌ను సాంకేతిక వినియోగదారుల దేశం నుంచి సాంకేతిక ఆవిష్కరణల దేశంగా మార్చగల పునాది మన విద్యావ్యవస్థలోనే పడాలి.