బీసీల రక్షణకు చట్టం రావాలి!
కులం పేరుతో అవమానం.. వృత్తి పేరుతో వివక్ష.. సామాజికంగా వెలివేత.. జీవనోపాధిపై దెబ్బ.. ఇవి ఆధునిక సమాజంలోనూ కొనసాగుతున్నా యంటే సామాజిక న్యాయం(Social Justice) ఇంకా సంపూర్ణం కాలేదనే అర్థం. ముఖ్యంగా అత్యం త వెనుకబడిన కులాలు, సంచార, అర్ధ సంచార జాతులు, సంప్రదాయ వృత్తులపై ఆధారపడే నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ సామాజిక వివక్ష ఎదుర్కొంటున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థి తుల్లో జీవిస్తూ, కులం లేదా వృత్తి పేరుతో అవమానాలకు గురవుతున్న ఈ వర్గాలకు సంక్షేమ పథకాల తోపాటు బలమైన చట్ట రక్షణ కూడా అవసరం. అందుకే తెలంగాణలో ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తేవాలన్న డిమాండ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.
కనీస వసతులూ కరువే!
బీసీలందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఒకేలా లేవు. ముఖ్యంగా సంచార, అర్ధసంచార జాతుల్లో అనేక కుటుంబాలకు శాశ్వత నివాసం, స్థిరమైన ఉపాధి, నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉన్నాయి. భిక్షాటన, చిన్నచిన్న సంప్రదాయ వృత్తు లు, అసంఘటిత రంగంలోని పనులపై ఆధారపడి జీవించే కుటుంబాలు పేదరికంతోపాటు సామాజిక అవమానాలను కూడా భరిస్తున్నాయి. కులం లేదా వృత్తి పేరుతో దూషించడం, బహిరంగంగా అవమానించడం, ప్రజా ప్రదేశాల్లో ప్రవేశాన్ని అడ్డుకోవడం, సామాజికంగా వెలివేయ డం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు ఎదురైనప్పుడు బాధితులకు తక్షణ న్యాయం అందించే ప్రత్యేక వ్యవస్థ అవసరం. పేదరికం ఒక సమస్య అయితే.. ఆత్మగౌరవంతో జీవించలేని పరిస్థితి అంతకంటే తీవ్రమైన సామాజిక సమస్య.
చట్టం దిశగా అడుగులు పడాలి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలపై కులం, సంప్రదాయ వృత్తి పేరుతో జరిగే అవమానాలు, వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక బీసీ రక్షణ చట్టం ముసాయిదాను రూ పొందించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ అలాంటి చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. బీసీ సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తుల పై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2026 సెప్టెంబర్ 12న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. ఇది స్వాగతించదగిన పరిణామం. అయితే ప్రభుత్వ ఆదేశం ముసా యిదా రూపకల్పనకు తొలి అడుగు మాత్రమే. సమగ్ర చట్టం రూపొందించి శాసనసభ ఆమోదంతో అమల్లోకి తీసుకురావడమే అసలైన లక్ష్యం కావాలి.
రాజ్యాంగ హక్కులకు రక్షణ..!
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కును, ఆర్టికల్ 15(2) కుల ప్రాతిపదికన ప్రజా వినియోగ ప్రదేశాల్లో వివక్షను నిషేధించే రక్షణను, ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవన హక్కును, ఆర్టికల్ 46 బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణను నిర్దేశిస్తున్నా యి. ఆర్టికల్ 15(4), 16(4) వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగపరమైన ఆధారాన్ని కల్పిస్తున్నాయి. భారతీయ న్యాయ సంహి త (బీఎన్ఎస్),
2023లోని సెక్షన్లు 351, 352 కూడా నిర్దిష్ట పరిస్థితుల్లో నేరపూరిత బెదిరింపులు, శాంతిభంగానికి దారితీసే ఉద్దేశపూర్వక అవమానాలపై వర్తిస్తాయి. అయితే బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న అన్ని రకాల కుల, వృత్తి ఆధారిత వివక్షను సమగ్రంగా ఎదుర్కొనే ప్రత్యేక వ్యవస్థగా వీటిని పరిగణించలేం. అందువల్ల రాజ్యాం గ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రస్తుత కేంద్ర చట్టాలతో సమన్వయం కలిగిన ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాలి. అవసరమైన సందర్భాల్లో రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లోని సమవర్తి జాబితా నిబంధనలు, ఆర్టికల్ 254(2) ప్రకారం రాష్ట్ర పతి ఆమోదానికి సంబంధించిన అంశాలను న్యాయనిపుణులు పరిశీలించాలి.
శిక్షే కాదు. భరోసా కావాలి!
ప్రతిపాదిత చట్టం కేవలం నేరస్థులకు శిక్షలు విధించే చట్టంగా మిగిలిపోకూడదు. బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేయగలగాలి. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసు రక్షణ, నిష్పాక్షిక దర్యాప్తు, ఉచిత న్యాయ సహాయం, తగిన పరిహారం, పునరావాసం అందేలా స్పష్టమైన నిబంధనలు ఉండాలి. సామాజిక బహిష్కరణ, ఉపాధి నిరాకరణ, ప్రజా సదుపాయాల వినియోగంలో వివక్ష వంటి అంశాలను చట్టంలో స్పష్టంగా నిర్వచించాలి. ఫిర్యాదు నుంచి న్యాయ పరిష్కారం వరకు బాధితుడికి అం డగా నిలిచే ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చట్టం కాగితాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోలీసు, రెవెన్యూ, సం క్షేమ శాఖల మధ్య సమన్వయంతో అమలయ్యేలా కార్యాచరణ రూపొందించాలి.
చివరిలో ఉన్నవారికి ముందుగా..
ఈ చట్ట రూపకల్పనలో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార, అర్ధసంచార జాతులు, సంప్రదాయ వృత్తుల సంఘా లు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన ముసాయిదాను పరిశీలిస్తూనే తెలంగాణ సామాజిక పరిస్థితులు, స్థానిక సమస్యలకు అనుగుణంగా సమగ్ర చట్టాన్ని రూపొందించాలి. కేవలం చట్టం తీసుకురావడమే కాకుండా, దాని అమలుకు అవసరమైన నిధులు, ప్రత్యేక అధి కార యంత్రాంగం, బాధితుల రక్షణ, పర్యవేక్షణ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయా లి. బీసీల అభివృద్ధిని కేవలం రిజర్వేషన్లు, విద్య, ఉపాధి అవకాశాలతోనే కొలవలేం.
ఒక వ్యక్తి తన కులం లేదా వృత్తి కారణం గా అవమానానికి గురికాకుండా జీవించగలగాలి. వివక్ష ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయగలగాలి. తనకు చట్టం అండగా ఉం టుందనే నమ్మకం కలగాలి. ముఖ్యంగా సంచార, అర్ధసంచార జాతులకు గౌరవప్రదమైన జీవనం, భద్రత, న్యాయం అందిన ప్పుడే సామాజిక న్యాయం లక్ష్యం నెరవేరుతుంది. బీసీలకు రిజర్వేషన్లు ఎంత అవస రమో.. వివక్ష నుంచి రక్షణ అంతే అవసరం. అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అయితే, ఆత్మగౌరవంతో జీవించే హక్కుకు భరోసా కల్పించడం కూడా అం తే ముఖ్యమైన బాధ్యత. తెలంగాణలో బీసీ రక్షణ చట్టం రూపుదిద్దుకుని, అట్టడుగు వర్గాల ఆత్మగౌరవానికి రాజ్యాంగబద్ధమైన రక్షణ కవచంగా నిలవాలి. అదే నిజమైన సామాజిక న్యాయం.. అదే సమానత్వ సమాజ నిర్మాణానికి బలమైన పునాది!
: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, 9959912341