పెట్టుబడులకు అవకాశాలు!

19-11-2026 | 05:30am

ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు మళ్లింది. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణను కొత్త చిరునామాగా నిలబెట్టే దిశగా అడుగులు పడుతు న్నాయి. ఒకప్పుడు ఐటీ, ఫార్మా రంగాల కు ప్రత్యేక గుర్తింపుపొందిన హైదరాబాద్ బ్రాండ్‌ను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలన్న లక్ష్యం ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన భారత్ సమ్మిట్(Bharat Summit) కేవలం ఒక అం తర్జాతీయ సదస్సు మాత్రమే కాదు.. 2047 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలకు ఈ స మ్మిట్ ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

ఒక రాష్ట్ర అభివృద్ధిని అంచనా వేయాలంటే రాజకీయ విమర్శలు, ప్రత్యర్థుల ప్రకటనలనే కొలమానంగా తీసుకో కూడదు. ఆ రాష్ర్టం ప్రపంచానికి తన సామర్థ్యాన్ని ఎలా పరిచయం చేస్తోంది?, పెట్టుబడులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తోంది?, యువతకు ఎలాంటి భవిష్యత్తును అందించబోతోంది? అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ప్రతిష్ఠను ఏ స్థాయికి తీసుకెళ్తోంది?.. అనే అంశాలను పరిశీలించాలి. ఈ కోణంలో చూస్తే హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో ఒక కీలక పరిణామం. తెలంగా ణను దేశంలోని ఒక రాష్ర్టంగా కాకుండా ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ సదస్సు ఒక వేదికగా నిలిచింది.

వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధు లు, వివిధ రంగాల నిపుణులు, రాజకీయ ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావ డం ద్వారా తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి సామర్థ్యాలను ప్రపం చానికి పరిచయం చేసే ప్రయత్నం జరిగింది. భారత్ సమ్మిట్‌పై కొన్ని రాజకీయ పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పెట్టుబడులు ఎక్క డ? విదేశీ ప్రతినిధుల రాకతో రాష్ట్రానికి తక్షణమే కలిగిన ప్రయోజనం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజం. కానీ ఒక అంతర్జాతీయ వేదిక విజయాన్ని కేవలం తక్షణ పెట్టుబడుల ప్రకటనలతోనే కొలవడం సరైన విధానం కాదు. ప్రపంచ పెట్టుబడుల ప్ర యాణం ఒక్కరోజులో పూర్తికాదు. అంతర్జాతీయ పరిచయాలు, వ్యాపార చర్చలు, విధానపరమైన అవగాహన, పరస్పర విశ్వాసం, భాగస్వామ్యాల నిర్మాణం వంటి అనేక దశల తర్వాతే పెట్టుబడులు కార్యరూపం దాలుస్తాయి. అందు వల్ల సదస్సు ముగిసిన వెంటనే ఎన్ని కోట్లు వచ్చాయనే ఒక్క ప్రశ్నతోనే దాని ప్రయోజనాలను నిర్ణయించడం తొందరపాటే అవుతుంది.

జాతీయ స్థాయిలో గుర్తింపు

ఈ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రా హుల్‌గాంధీ హాజరుకావడాన్ని కొందరు రాజకీయ కోణంలోనే చూడాలని ప్రయత్నిస్తున్నారు. అయితే జాతీయ స్థాయి నాయకులు తెలంగాణ వేదికపై పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, యువత భవిష్యత్తు వంటి అంశాలపై చర్చించడం రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే అంశం.

నాయకుల ప్రసంగాలపై రాజకీయ విమర్శలు చేయడం కంటే వారు ప్రస్తావించిన అంశాలపై ప్రభుత్వం ఎంతవరకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందన్నది ముఖ్యం. రాహుల్‌గాంధీ జాతీయస్థాయిలో ప్రస్తావిస్తున్న సామాజిక న్యాయం, కులగణన, సమానావకా శాలు, అణగారిన వర్గాల భాగస్వామ్యం వంటి అంశాలకు తెలంగాణ వేదికపై ప్రాధాన్యత లభించడం ప్రజాస్వామ్య చర్చకు కొత్త కోణాన్ని అందిస్తుంది.

అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించడం, వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, అభివృద్ధి ఫలాలను సమానంగా అందించడం కూడా అంతే ముఖ్యం. హైదరాబాద్‌కు ఇప్పటికే ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, వైద్య రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఈ గుర్తింపును మరింత విస్తరించి, ఆధునిక సాంకేతిక రంగాలు, కొత్త పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీ యమైన కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభు త్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఫ్యూచర్ సిటీ, ఐటీ రంగ విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధి వంటి ప్రతిపాదనలు ఈ దిశలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాలంటే కేవలం భూ ములు కేటాయించడం, రాయితీలు ప్రకటించడం సరిపోదు. రాజకీయ స్థిరత్వం, పారదర్శక విధానాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం అవసరం. ఈ అంశాలన్నింటినీ సమన్వయం చేయగలిగితే తెలం గాణ అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా ఎది గే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో భారత్ సమ్మిట్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రపంచ స్థాయి ఆలోచనా వేదికగా భా రత్ సమ్మిట్‌ను అభివృద్ధి చేయాలన్న రాహుల్‌గాంధీ ఆలోచనకు అనుగుణంగా 12 అంతర్జాతీయ ప్యానెల్స్, 8 తెలంగాణ రైజింగ్ విజన్ సెషన్స్ నిర్వహించడం ఈ సదస్సులో మరో ముఖ్యమైన అంశం. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, అం తర్జాతీయ ప్రతినిధుల చర్చల ద్వారా తెలం గాణ అభివృద్ధికి సంబంధించిన కొత్త ఆలో చనలు, అవకాశాలను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంత ముఖ్యమో, ఆ గుర్తింపుతో వచ్చే బాధ్యతను నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యం. అయితే అంతర్జాతీయ సదస్సులు, పెట్టుబడుల సమావేశాల అసలైన లక్ష్యం సామా న్యుడి జీవితంలో మార్పు తీసుకురావడ మే కావాలి. ముఖ్యంగా మన యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఉపాధి, స్థానిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, చిన్న వ్యాపారాలకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావాలి. పెట్టుబడుల ప్రతిపాదనలు వాస్తవ పరిశ్రమలుగా మారాలి. పరిశ్రమల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత లభించాలి. ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు గ్రామీణ ప్రాంతాలకూ అభివృద్ధి విస్తరించాలి.

అప్పుడే అంతర్జాతీయ వేదికల అసలైన ప్రయోజనం ప్రజలకు అం దుతుంది. అం దుకే భారత్ సమ్మిట్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచ రణ ప్రణాళికను రూపొందించాలి. సదస్సులో వచ్చిన పెట్టుబడుల ప్రతిపాద నలు, వాటి అమలు పురోగతి, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన, రంగాలవారీ ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచాలి. పెట్టుబడుల ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. పారదర్శకత, జవాబుదారీతనమే ప్రభుత్వ విశ్వసనీయతను మరింత పెంచుతాయి.

రాష్ట్ర ప్రగతి అందరి బాధ్యత

రాజకీయ పార్టీలు మారవచ్చు. ప్రభుత్వాలు మారవచ్చు. కానీ, తెలంగాణ అభి వృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. గత ప్రభుత్వాలు నిర్మించిన ఆస్తులు, సృ ష్టించిన మౌలిక సదుపాయాలను సమర్థంగా వినియోగించుకుంటూనే కొత్త అవ కాశాలనుసృష్టించడం ఏ ప్రభుత్వానికైనా బాధ్యత. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిర్మాణాత్మకంగా పరి శీలించాలి. లోపాలుంటే ప్రశ్నించాలి. ప్రజాధనం ఖర్చు చేసినప్పుడు జవాబుదారీతనాన్ని కోరాలి.

అదే సమయంలో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాలను కేవలం రాజకీయ వ్యతిరేకతతో తక్కువ చేసి చూడకూడదు. ఉద్యమం ద్వారా సాధించుకున్న రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా, సామాజికం గా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, పారిశ్రామికవేత్తలు, మేధావులపై ఉంది. అభివృద్ధి విషయంలో రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అం దరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా నిలబెట్టాలన్న లక్ష్యంతో నిర్వహించిన భారత్ సమ్మిట్‌కు సం బంధించి దాదాపు 115మంది విదేశీ ప్రతినిధుల రాకను కేంద్రం అడ్డుకుందన్న ఆరోపణలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత అవసరం. 2047 నాటికి తెలంగాణను ట్రిలియన్ డా లర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యా న్ని చేరుకోవాలంటే రాజకీయ విభేదాలకంటే అభివృద్ధి ప్రాధాన్యత పొందాలి.

మరోవైపు భారత్ సమ్మిట్‌లో రాహుల్‌గాంధీ అంతర్జాతీయ ప్రతినిధులతో పా ల్గొన్న చర్చలను బీజేపీ నేతలు రాజకీయ కోణంలో విమర్శిస్తున్నారు. విదేశీ శక్తుల తో కలిసి దేశంలో పాలన మార్పు కుట్రకు సంబంధించిన సమావేశమంటూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా వాదోపవాదాలకు దారితీశాయి. అయితే ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలకంటే సదస్సులో చర్చించిన అభివృద్ధి అంశాలు, వాటి అమలు, రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలపై దృష్టి పెట్టడం అవసరం. రాజకీయ విమర్శలకు అభివృద్ధి ఫలితాలే సమాధానం కావాలి.

చర్చలు కార్యరూపం దాల్చాలి

అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ పేరు మారుమోగడం ఆరంభం మాత్రమే కాకూడదు. ఆగుర్తింపును పెట్టుబడులుగా, పెట్టుబడులను పరిశ్రమలుగా, పరి శ్రమ లను ఉద్యోగాలుగా, ఉద్యోగాలను ప్రజల ఆర్థిక అభ్యున్నతిగా మార్చినప్పుడే అసలైన విజయం సాధించినట్టు. భారత్ సమ్మి ట్ ద్వారా ప్రారంభమైన అంతర్జాతీయ పరిచయాలు, చర్చలు, అభివృద్ధి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాల్సిన బాధ్యత  రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందున్న అసలైన సవాలు కూడా ఇదే.

అంతర్జాతీయ వేదికపై ప్రారంభమైన చర్చలను క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఫలితాలుగా మా ర్చగలిగితే విమర్శలకు సమాధానం లభిస్తుంది. తెలంగాణ యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక స్వావలం బన, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, రైతులకు మెరు గైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను వేగవం తం చేయాలి. విమర్శలు ప్రజాస్వామ్యానికి అవసరమే.. కానీ రాష్ట్ర ప్రగతికి అవరోధాలు కాకూడదు. నాడు పోరాడి సాధిం చుకున్న తెలంగాణను నేడు ప్రపంచం గర్వించే అభివృద్ధి రాష్ర్టంగా తీర్చిదిద్దుకోవాలి. హైదరాబాద్ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదగాలి.

తెలంగాణ అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలి. అభి వృద్ధి ఫలాలు నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి. ఇదే భారత్ సమ్మిట్ ముందుంచిన ఆశయం.. ఇదే తెలంగాణ రైజింగ్ లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడంతో పాటు, ఆ గుర్తింపును ప్రజ ల జీవితాల్లో సానుకూల మార్పుగా మలచగలిగినప్పుడే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దార్శ నికతకు నిజమైన సార్థకత చేకూరుతుంది.

విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం, సెల్ నెం: 9866255355 

ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్

మరిన్ని వార్తలు